ఈ నెల 13 నుంచి వారం రోజుల పాటు

ఈ నెల 13 నుంచి వారం రోజుల పాటు
- ఇటు వినియోగదారులకు, అటు వ్యాపారులకు డబుల్ ప్రయోజనాలు…
- జీఎస్టీ సంస్కరణలతో జిల్లా ప్రజలకు రూ. 250 కోట్లు – రూ. 300 కోట్లు ఆదా..
- ప్రతి కుటుంబానికీ నెలకు దాదాపు రూ. 6 వేలు నుంచి రూ. 12 వేలు మేలు..
- సమష్టి భాగస్వామ్యంతో షాపింగ్ ఉత్సవాన్ని విజయవంతం చేద్దాం..
- సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ – సూపర్ ఫెస్టివల్‌పై జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ..
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్‌తో ఇటు వినియోగదారులకు అటు వ్యాపారులకు సూపర్ ప్రయోజనాలు కలుగుతాయని.. ప్రతి కుటుంబానికీ, ప్రతి వ్యాపారానికీ ఎంతో మేలు జరుగుతుందని.. జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలపై అవగాహన కల్పించే క్రమంలో ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ను విజయవాడలో నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని పున్నమిఘాట్ – బెరం పార్కులో జరిగే గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌పై కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో కలిసి ఆదివారం కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ… వాణిజ్యం, వినోదానికి వేదికగా నిలిచే షాపింగ్ ఫెస్టివల్లో వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, హస్తకళాకారులు.. ఇలా వివిధ వర్గాలవారు తమ స్టాళ్లను ఏర్పాటుచేసుకొని బ్రాండ్ ప్రమోటింగ్ చేసుకోవచ్చన్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు జీఎస్టీ ప్రయోజనాలు కల్పించడంతో పాటు దీపావళి పండగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు, రాయితీలు ప్రకటిస్తాయన్నారు.
మెగా లక్కీ డ్రాలతో పాటు ఉత్తమ స్టాళ్లకు అవార్డులు కూడా అందించనున్నట్లు వెల్లడించారు. దాదాపు 100 స్టాళ్లతో ఏర్పాటుచేసే ఈ ఫెస్ట్‌లో జీఎస్టీ సంస్కరణల ఫలాలపై మేధోమథన చర్చలు, సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ భాగస్వాములై ఈ ఫెస్ట్‌ను విజయవంతం చేయాలని, స్థానిక వ్యాపారులు, ప్రజలు ఫెస్ట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు.
సూపర్ జీఎస్టీతో ప్రతి కుటుంబానికి రూ. 12 వేల వరకు ఆదా…
సూపర్ జీఎస్టీతో రాష్ట్ర ప్రజలకు దాదాపు రూ. 8 వేల కోట్లు, ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు రూ. 250 కోట్లు – రూ. 300 కోట్లు ఆదా అవుతుండగా ప్రతికుటుంబానికి నెలకు రూ. 6 వేలు నుంచి రూ. 12 వేల వరకు ఆదా అవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా జీఎస్టీ 2.0 సంస్కరణలతో అది 18 శాతానికి తగ్గిందన్నారు. సోలార్ వాటర్ హీటర్లు, కుట్టు మిషన్లు, వాకీటాకీలపై గతంలో 12 శాతం ఉన్న జీఎస్టీ నేడు 5 శాతానికి తగ్గిందని.. అదేవిధంగా సబ్బులు, టూత్‌పేస్టులు, వంటనూనెలు, డిటర్జెంటులు వంటి నిత్యావసర ఎఫ్ఎంసీజీ వస్తువులపై గతంలో 18 శాతం జీఎస్టీ ఉండగా అది 5 శాతానికి తగ్గిందని వివరించారు.
బీమా, ఆరోగ్య పాలసీలపై గతంలో 18 శాతం జీఎస్టీ ఉండగా అది నేడు సున్నా శాతం అయిందన్నారు. హస్తకళల ఉత్పత్తులు, టెక్స్‌టైల్స్‌పై 12 శాతం ఉన్న జీఎస్టీ అయిదు శాతానికి తగ్గిందని.. మిక్సీలు, కుక్కర్లు, గ్రైండర్లు, ఫ్యాన్లు వంటి వస్తువులపై గతంలో 18 శాతం జీఎస్టీ ఉంటే అది అయిదు శాతానికి తగ్గిందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్‌పై సమాచారం పొందాలన్నా, ఎవరైనా పాత ధరలకే వస్తువులు అమ్ముతున్నా కలెక్టరేట్లోని 9154970454 కమాండ్ కంట్రోల్ రూమ్ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ జహీర్, అసిస్టెంట్ కమిషనర్ ప్రజ్ఞా రాధిక, జిల్లా పరిశ్రమల అధికారి పి.మధు తదితరులు పాల్గొన్నారు.
