Food donation | జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం
- 380వ సారికి చేరుకున్నజనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం
Food donation | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి టౌన్ కాంటా చౌరస్తాలోని పల్లెటూరి బస్టాండ్ వద్ద దాతల సహకారంతో నిర్వారామంగా నిర్వహిస్తున్న జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం ఇవాళ చేపట్టిన అన్నదానంతో 380వ సారికి చేరుకుంది. ఈ సందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ.. అన్ని దానాల్లో అన్నదానం గొప్పదన్నారు. ఆకలితో ఉన్నవారికి ఒక పూట అన్నం అందించడం ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. దాతల సహకారంతో ఉగాది సందర్భంగా 2021 ఏప్రిల్ 13న ఈ జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.
అప్పటి నుంచి ప్రతి బుధవారం నిరంతరంగా అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. తాజాగా చేపట్టిన అన్నదానం బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంప్ బస్తీకి చెందిన పుట్నాల మల్లయ్య సతీమణి బన్నే అమ్మక్క 12వ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థంగా నిర్వహించినట్లు తెలిపారు. బన్నే చందు–భాగ్యలక్ష్మి దంపతులు, మనుమరాళ్లు అక్షయ, లక్ష్మి ప్రసన్న, అన్విత, మనుమడు అవినాష్ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యాచకులు, నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులు కలిపి సుమారు 180మందికి అన్నదానం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగేందుకు దాతలు ముందుకు రావాలని ఆడెపు సతీష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో జనహిత సేవా సమితి ఉపాధ్యక్షులు హనుమాండ్ల రమాదేవి, కందుల రాజన్న, సాయి కృష్ణ, బోనాల సతీష్, తదితరులు పాల్గొన్నారు.

