జన్నారం, జులై 16( ఆంధ్రప్రభ): మంచిర్యాల (Mancherial) జిల్లా కవ్వాల టైగర్ రిజర్వ్ లోని జన్నారం అటవీ డివిజనల్ ఇందనపల్లి (Indanapalli) ఫారెస్ట్ రేంజ్ లోని కవ్వాల ఫారెస్ట్ సెక్షన్ అడవుల్లో జిల్లా ఫ్లయింగ్ స్క్యాడ్ రేంజ్ ఆఫీసర్ కె.రమాదేవి (K.Ramadevi) ఆధ్వర్యంలో బృందం తనిఖీలు చేశారు. కవ్వాల అడవుల్లో చెట్ల నరికివేత అనే శీర్షికతో ఆంధ్రప్రభలో ఈనెల 3న వచ్చిన వార్తకు కవ్వాల టైగర్ రిజర్వ్ (Kawal Tiger Reserve) ఎఫ్డీపీటీ, మంచిర్యాల సీఎఫ్ శాంతారాం స్పందించారు.
ఈ మేరకు ఆ బృందం అడవుల్లోకి వచ్చి చెట్లు నరికిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడుతూ… కవ్వాల అడవుల్లోకి వెళ్లి చెట్లు నరికిన స్థలాన్ని పరిశీలించామన్నారు. విచారణ నివేదికను సీఎఫ్ కు అందజేయనున్నామని ఆమె తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేసిన రేంజ్ ఆఫీసర్ పై జన్నారం మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎం.డి రియాజోద్దీన్ (M.D. Riazuddin) పలు ఆరోపణలతో కూడిన ఫిర్యాదును కవ్వాల టైగర్ రిజర్వ్ ఎఫ్డీపీటీ, మంచిర్యాల సీఎఫ్ శాంతారాంకు చేశారు. ఆ రేంజ్ ఆఫీసర్ ఇంట్లో అక్రమ టేకు కలపతో ఫర్నిచర్ తయారు చేయించుకున్నాడని, అడవుల నుంచి విలువైన టేకు చెట్లను మిషన్లతో కోయించి, నరికించి దుంగలుగా తయారు చేయించి, ఇతర ప్రాంతాలకు తరలించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఆ ఫారెస్ట్ రెంజ్ ఆఫీసరుకు ఏఓసీ ఇచ్చినట్లు తెలిసింది.