Fire Accident | కాటన్ గోడౌన్‌లో మంటలు…

Fire Accident | కాటన్ గోడౌన్‌లో మంటలు…
- భారీగా దగ్ధమైన నిల్వలు
- తృటిలో తప్పిన ప్రాణాపాయం
Fire Accident | నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామ మండల కేంద్రంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక వీర్లపల్లి రోడ్డులో ఉన్న శ్రీ కృష్ణ రూరల్ గోడౌన్ (సీసీఐ – సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీకి చెందిన పరిశ్రమ)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో కాటన్ నిల్వలు ఉండటంతో మంటలు క్షణాల్లో వ్యాపించి భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

ఈ ఉదయం గోడౌన్‌లోని కాటన్ నిల్వలకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. దూది స్వభావం కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. గమనించిన పరిశ్రమ సిబ్బంది వెంటనే అప్రమత్తమై పోలీసులకు మరియు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజిన్‌తో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు, పరిశ్రమ సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో మంటలు ఇతర విభాగాలకు వ్యాపించకుండా అడ్డుకున్నారు.

ఈ ఘటన సమయంలో గోడౌన్‌లో సిబ్బంది ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో భారీగా కాటన్ నిల్వలు దగ్ధమైనట్లు సమాచారం.

అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
