ఆర్థిక భరోసా
శ్రీకాకుళం ఆంధ్రప్రభ:
కాశీబుగ్గ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అందజేసింది. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ తో కలిసి ఆదివారం ఉదయం వారికి చెక్కులను అందజేశారు. రాగోలులోని జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులను కలెక్టర్, ఎమ్మెల్యే స్వయంగా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, ప్రభుత్వం ప్రకటించిన రూ. 3 లక్షల విలువ చేసే చెక్కులను ముగ్గురు బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు.
మెరుగైన వైద్యం అందించాలి..
వైద్య చికిత్స పొందుతున్న దువ్వు కుమారి (25): బెల్లిపటియా గ్రామం, మందస మండలం, బడే కళావతి (49) : రౌతుపురం, నందిగాం మండలం, బోడసింగి నిమ్మమ్మ (55): నందిగాంలకు చెందిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు కలెక్టర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా సూచించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో సాయి ప్రత్యూష, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

