బీఎండబ్ల్యూ బీభత్సం…

- ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారి మృతి…
న్యూఢిల్లీ : రాజధాని ఢిల్లీలో ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న నవ్‌తోజ్ సింగ్ (52) బైక్‌పై ప్రయాణిస్తుండగా, ఢిల్లీ కాంట్ మెట్రో స్టేషన్ సమీపంలో రింగ్ రోడ్‌పై బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నవ్‌తోజ్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయాన భార్య సందీప్ కౌర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దంపతులు బంగ్లాసాహిబ్ గురుద్వారా నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు, బీఎండబ్ల్యూ వాహనాన్ని ఒక మహిళ నడుపుతున్నారని అనుమానం వ్యక్తమవుతోంది. ప్రమాదం అనంతరం ఆ మహిళ, ఆమెతో ఉన్న వ్యక్తి కలిసి గాయపడిన నవ్‌తోజ్ సింగ్ దంపతులను సమీపంలోని ఆసుపత్రికి కాకుండా దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీటిబి నగర్ ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయంలో బాధితుడి కుమారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. “నా తల్లిదండ్రులు ప్రమాదానికి గురయ్యారు. దగ్గర్లో ఆసుపత్రి ఉన్నా, వారిని 17 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లారు. ఫలితంగా నా తండ్రి మృతి చెందగా, అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంది,” అని ఆయన అన్నారు.
అదేవిధంగా, ప్రమాదానికి కారణమైన ఆ మహిళను దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆయన ఆరోపించాడు. ఆసుపత్రి అధికారులు ఆమెపై సమాచారం ఇవ్వకపోగా, నకిలీ మెడికో–లీగల్ సర్టిఫికేట్ సిద్ధం చేస్తున్నారు అని తీవ్ర విమర్శలు గుప్పించాడు.
ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
