పెద్దపల్లి : తనకు పదవీ ఉన్నా, లేకపోయినా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలిగా ఉంటూ సింగరేణి కార్మికుల (Singareni Workers) సమస్యపై పోరాటం చేస్తానని తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఈ మేరకు సింగరేణి కార్మికులకు బహిరంగ లేఖ రాశారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ (Koppula Ishwar) కు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల చట్టాలకు విరుద్ధంగా ఎన్నిక నిర్వహించారని మండిపడ్డారు. రాజకీయ కారణాలతోనే ఎన్నిక జరిగిందని వెల్లడించారు. సింగరేణి కార్మికుల కోసం పోరాడుతుంటే తనపై కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పరిణామాలు అందరికీ తెలుసు…
బీఆర్ఎస్ (BRS) లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసునని కవిత అన్నారు. పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ (KCR) ప్రసంగంపై లేఖ రాశానని, అయితే తాను అమెరికా వెళ్లినప్పుడు లేఖను లీక్ చేశారన్నారు. తాను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా కక్ష కట్టారని పేర్కొన్నారు. తాను టీబీజీకేఎస్ (TBGKS) గౌరవ అధ్యక్ష పదవిలో లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలిగా ఉంటానని చెప్పారు.