పదిహేనో రోజుకు చేరిన టాలీవుడ్ సమ్మె

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : టాలీవుడ్ లో సినీ కార్మికులకు నిర్మాత‌ల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న పంచాయితీ ఎడ‌తెగ‌డం లేదు. వేతనాల పెంపు, పెంచిన వేతనాలను సకాలంలో చెల్లించాలనే డిమాండ్లతో టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. కార్మిక సంఘాలు, నిర్మాతల మండలికి మధ్య జరిగిన చర్చలు సఫలం కాక‌పోవ‌డంతో పదిహేను రోజుల నుంచి షూటింగ్స్ నిలిచిపోయాయి. కార్మిక సంఘాలు పెట్టిన అన్ని డిమాండ్లను అంగీకరించే పరిస్థితుల్లో లేమని నిర్మాతలు చెబుతుండగా, తమకు బకాయీపడిన పదమూడు కోట్ల రూపాయల వేతనాలు చెల్లించాలని కార్మికసంఘాలు పట్టుబడుతున్నాయి. ఈ విష‌యంపై ఈరోజు కార్మిక సంఘాల నేతలు మెగాస్టార్ చిరంజీవిని కలవనున్నారు. అంతుకు ముందు ఫెడరేషన్ కార్యాలయంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

పెద్ద‌న్న‌గా చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దన్న‌గా మారారు. దర్శకుడు దాసరి నారాయణరావు ఉన్నంత వ‌ర‌కు ఆయనే అంద‌రికీ పెద్ద‌గా వ్యవహరించి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చొర‌వ చూపేవారు. దాస‌రి మ‌ర‌ణానంత‌రం సినీ ప‌రిశ్ర‌మ‌లోని వారంతా చిరంజీవి వైపు చూస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్ర పరిశ్రమలో తలెత్తుతున్న అనేక సమస్యలకు చిరంజీవి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాల నిర్మాతల తరుపున ముఖ్యమంత్రిని కలిసే బృందంలోనూ ఆయననే ముందు పెట్టి వెళుతున్నారంటే ఆయనకు పరిశ్రమ ఇస్తున్న గౌరవం అదే అనుకోవాలి. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంటి వద్దకు సమ్మె పంచాయతీ చేరింది. ఈరోజు ఇటు నిర్మాతలతోనూ, అటు కార్మిక సంఘాల ప్రతినిధులతోనూ చిరంజీవి విడివిగా సమావేశమవుతున్నారు. చిత్ర పరిశ్రమ ప్రతిష్టను పెంచడంతో పాటు జరిగే నష్టాన్ని నివారించడానికి చిరు నడుంకట్టారనే అనుకోవాలి.

కారణాలు.. డిమాండ్లు
తెలుగు సినీ పరిశ్రమలో సుమారు 24 క్రాఫ్ట్‌లలో 15,000 మందికి పైగా రిజిస్టరైన కార్మికులు ఉన్నారు. సాధారణ కార్మికుల నుంచి లైట్ బాయ్స్, డ్రైవర్లు, మేకప్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఫైటర్స్, డ్యాన్సర్స్ వరకు అనేక మంది ఈ పరిశ్రమలో భాగం. ఈ కార్మికులందరూ సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తూ, తమ కుటుంబాలను పోషిస్తున్నారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా సినిమా బడ్జెట్లు, హీరోల రెమ్యునరేషన్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయినప్పటికీ, కార్మికుల వేతనాలు మాత్రం పెద్దగా పెరగలేదు. ప్రస్తుత జీవన వ్యయానికి, వారికి అందుతున్న వేతనాలకు మధ్య భారీ అంతరం ఏర్పడింది. ఈ వ్యత్యాసమే సమ్మెకు ప్రధాన కారణం. సకాలంలో వేతనాల చెల్లింపు. చాలా సందర్భాల్లో, వేత‌నాలు చెల్లించడంలో నిర్మాతల నుంచి తీవ్ర జాప్యం జరుగుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల తమకు ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయని, తమ కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని వాపోతున్నారు. పని ప్రదేశంలో భద్రత. ప్రమాదాలు జరిగినప్పుడు సరైన పరిహారం, వైద్య సదుపాయాలు అందడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు, కార్మికుల సంక్షేమం కోసం బీమా, ఆరోగ్య భద్రత వంటి సౌకర్యాలు కల్పించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.

వేల కోట్ల పరిశ్రమ- స్వ‌ల్ప వేత‌నాలు..
ప్రస్తుతం, తెలుగు సినీ పరిశ్రమ ఒక భారీ వ్యాపార సామ్రాజ్యంగా మారింది. వార్షిక టర్నోవర్ రూ 3,000 కోట్ల నుంచి రూ 4,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ భారీ ఆదాయంలో సింహభాగం కేవలం కొద్దిమంది స్టార్లకే వెళ్తోంది. స్టార్ హీరోల రెమ్యునరేషన్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోలు సినిమాకు రూ 80 కోట్ల నుంచి రూ 150 కోట్లు తీసుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. హీరోయిన్లు కూడా ఒక్కో సినిమాకు రూ 5 కోట్ల నుంచి రూ 10 కోట్ల వరకు పారితోషికాలు అందుకుంటున్నారు. అయితే, ఒక సాధారణ కార్మికుడికి రోజువారీ వేతనం రూ 1000 నుంచి రూ 1500 వరకు మాత్రమే ఉంటుంది. టెక్నీషియన్లకు రూ 2000 నుంచి రూ 3000 వరకు వేతనాలు ఉంటాయి. ఈ వేతనాలు హైదరాబాద్ వంటి నగరంలో కుటుంబం గడపడానికి ఏ మాత్రం సరిపోవు. పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో, ఈ తక్కువ వేతనాలతో వారు జీవించడం అసాధ్యంగా మారింది. వేతనాల పెంపు 30% నుంచి 45% వరకు పెంచి, దాంతోపాటు సకాలంలో వేతనాల చెల్లింపు చేయాల‌ని కార్మీకులు ప్ర‌ధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఒక సినిమా బడ్జెట్‌లో ఎక్కువ భాగం హీరో, హీరోయిన్ల, ద‌ర్శ‌కుల‌ రెమ్యునరేషన్‌లకే కేటాయిస్తున్నప్పుడు, కార్మికుల వేతనాలను పెంచడానికి నిరాకరించడం ఎంతవరకు సమంజసమని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply