Field trip | పట్టణ అభివృద్ధికి ప్రతీ ఒక్కరు సహకరించాలి

Field trip | పట్టణ అభివృద్ధికి ప్రతీ ఒక్కరు సహకరించాలి
- కొత్త కమిషనర్ జి వెంకటరామిరెడ్డి
Field trip | నందికొట్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఎలాంటి సమాచారం లేకుండా కొత్త కమిషనర్ రంగంలోకి దిగడంతో క్షేత్రస్థాయిలోని ఉద్యోగులు, సిబ్బందికి చలిలో చెమటలు పట్టాయి. అధికారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండానే కొత్త కమిషనర్ జి వెంకటరామిరెడ్డి పట్టణంలోని వివిధ వార్డులో ఈ రోజు ఉదయం సరిగ్గా 5 గంటలకు ప్రత్యక్షమయ్యారు.

వార్డులోని హౌసింగ్ బోర్డు చైతన్య స్కూల్ లో కాలనీలో తిరుగుతూ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. చెత్త ట్రాక్టర్ సమయం ప్రకారం వస్తుందా.. వస్తుంటే మీరెందుకు వీధుల్లో చెత్త వేస్తున్నారని కమిషనర్ అక్కడి మహిళలను ప్రశ్నించారు. ఇక నుంచి చెత్తను వీధుల్లో.. రోడ్ల వెంట వేస్తే భారీగా జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

ఇంట్లోని చెత్తా చెదారాన్ని మున్సిపల్ వాహనంలోని సిబ్బందికి అందించాలని మహిళలకు సూచించారు. తాగునీరు ఎంత సేపు వస్తుంది, ఏ సమయంలో వస్తుంది.. అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మురుగు కాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పారిశుద్ధ్యం నిర్వహణలో ఎక్కడా లోపాలు రావద్దని సంబంధిత అధికారులకు సూచించారు. ఆస్తి పన్ను చెల్లింపులు సక్రమంగా ఉండాలని, వార్డు ఆఫీసర్లకు రోజు వారి టార్గెట్ విధించి వంద శాతం పన్ను వసూలు చేసేలా చూడాలన్నారు.

అదే కాలనీలో ఉన్న బాయ్స్ హాస్టల్ ను పరిశీలించారు. కాలనీలో నీటికి సంబంధించి అధికారులను ఆరా తీశారు. పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్ని మున్సిపల్ కమీషనర్ జి వెంకటరామిరెడ్డి అన్నారు. పట్టణంలోని చైతన్య స్కూల్ సమీపంలో జరుగుతు న్న డ్రైనేజీ పనులను ఆయన ప రిశీలించారు. పట్టాణంలోని కాలనీలలో ఉన్న సమస్యల పై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామన్నారు.

కాలనీలలో ఉన్న ప్రధాన సమస్యలు డ్రైనేజీ సీసీ రోడ్లు వేసేందుకు త్వరలో రూపకల్పన చేశామన్నారు. కాలనీలలో అధికారులు సమస్యలు లేకుండా చూడాలని మునిసిపల్ సిబ్బందికి ఆయన సూచించారు. నందికొట్కూరు మున్సిపాలిటీలో సమస్యలపై అధ్యయనానికి శ్రీకారం మొదలు పెట్టానని అన్నారు. వార్డు సభ్యులతో కలిసి ఒక్కో రోజు ఒక్కో వార్డులో సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగుతున్నారు.
రోడ్లు, కాలువల దుస్థితిపై స్థానికులు అందించిన విజ్ఞప్తులపై స్పందించిన ఆయన, దెబ్బతిన్న కల్వర్టులను వెంటనే పునరుద్ధరించాలని, సీసీ రోడ్ల పనులను త్వరితగతిన పట్టాలెక్కించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగులు మనోజ్ కుమార్ రెడ్డి చాంద్ బాషా శేషఫణి రవితేజ సుబ్బయ్య వార్డు ఇన్చార్జి రజిని కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
