అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) మంగళవారం కీలక నిర్ణయం ప్రకటించింది. ఫిడే వరల్డ్ కప్ 2025 పోటీలు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు గోవాలో జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో 90కిపైగా దేశాల నుండి 206 మంది గ్రాండ్‌మాస్టర్లు పాల్గొంటారు.
ఎనిమిది రౌండ్ల నాకౌట్ ఫార్మాట్ టోర్నమెంట్‌లో ప్రపంచం అగ్రశ్రేణి ఆటగాళ్లు పోటీపడనున్నారు. మొత్తం 2 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.17.5 కోట్లు) ప్రైజ్ మనీగా ఉండే ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో.. గెలుపొందిన మొదటి ముగ్గురు ఆటగాళ్లు కాండిడేట్స్ టోర్నమెంట్ (Candidates Tournament 2026)లో నేరుగా అర్హత సాధించనున్నారు. అదే వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌కి అర్హత దారిగా ఉంటుంది.
(వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ 2026 లో.. ప్రస్తుత వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ డొమరాజు తన టైటిల్‌ను కాపాడుకునేందుకు బరిలోకి దిగబోతున్నారు. ఇక, Candidates Tournament 2026లో విజయం సాధించే ఆటగాడు గుకేశ్‌కు ప్రత్యర్థిగా నిలుస్తాడు. ఈ ప్రతిష్టాత్మక పోటీ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని త్వరలోనే FIDE ప్రకటించనుంది.)
ఇక గోవా వేదికగా జరగనున్న ఫిడే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ “విన్ ఆర్ గో హోమ్” తరహాలో ఉంటుంది కాబట్టి, ప్రతి రౌండ్ ఉత్కంఠభరితంగా సాగనుంది. అయితే, ఐదు సార్లు విజేతగా నిలిచిన నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్ ఈసారి పోటీల్లో కనిపించే అవకాశం లేదని సమాచారం.