పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి
@ గణేష్ శోభాయాత్రను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. వినాయక నవరాత్రుల ముగింపు సందర్భంగా శుక్రవారం నల్గొండ (Nalgonda జిల్లా కేంద్రంలోని పాత పట్టణంలోని హనుమాన్ పురాలో ఏర్పాటు చేసిన ఒకటవ నంబర్ వినాయక విగ్రహానికి మంత్రి పూజాధిక్యాలు నిర్వహించి, గణేష్ శోభాయాత్రను ప్రారంభించారు.
అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… నల్గొండ జిల్లాలో గడచిన 30 సంవత్సరాల నుండి ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలను, నిమజ్జనాన్ని నిర్వహించుకోవడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే శాంతియుత వాతావరణంలో వినాయక శోభాయాత్ర (Shobha Yatra), నిమజ్జనం నిర్వహించాలని యువతకు సూచించారు.
ప్రత్యేకించి యువకులు ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శించవద్దని కోరారు. నల్గొండ పట్టణంలో మత సామరస్యంతో పాటు, అన్ని మతాలను గౌరవిస్తూనే అభివృద్ధిని కొనసాగిస్తున్నామన్నారు. 200కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల (Young India Integrated Residential School) నిర్మాణాన్ని మొదలుపెట్టామని, లతీఫ్ సాహెబ్ దర్గా గుట్ట, బ్రహ్మంగారి గుట్టలకు 150కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్లు నిర్మిస్తున్నామని, 30% పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రభుత్వం ఈ సంవత్సరం వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్తును ఇవ్వడం జరిగిందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) మాట్లాడుతూ… అన్ని శాఖల సిబ్బంది గణేష్ ఉత్సవ కమిటీల సహకారంతో క్రమశిక్షణను పాటిస్తూ 9 రోజులపాటు జిల్లాలో గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకున్నారని, గణేష్ శోభాయాత్రతో పాటు, నిమజ్జనాన్ని కూడా ఇదేవిధంగా కొనసాగించాలని ఆమె కోరారు. నల్గొండ జిల్లాలో ప్రజలు గంగా, జమున, తెహజీబ్ సాంప్రదాయాన్ని పాటిస్తారన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sharat Chandra Pawar) మాట్లాడుతూ… సీసీ కెమెరాల నిఘాతో గణేష్ శోభాయాత్రను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి ,గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కర్నాటి యాదగిరి, వక్త వెంకట్ నివాస్ ,చింతల సాంబమూర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ ,మాజీ జెడ్పిటిసి, లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి, తదితరులు వినాయక విగ్రహానికి పూజలు నిర్వహించారు.