Fast tag | నేటి నుంచి అమల్లోకి ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్ !
ఫాస్ట్ ట్యాగ్‌లో కొత్త రూల్స్ ఈరోజు (సోమవారం) నుంచి అమల్లోకి రానున్నాయి. నియమాలు తెలుసుకోకపోతే మాత్రం అదనంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి, ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించిన నియమాలను నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అమలు చేస్తోంది.
నూతన నియమాలు తెలుసుకోకపోతే అదనపు చార్జీలు కట్టాల్సి వస్తుంది. టోల్ ప్లాజాకు చేరుకున్నప్పుడు ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్‌లిస్ట్‌లో ఉండకూడదు. లావాదేవీ రిజెక్ట్ అయితే రెట్టింపు టోల్ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా టోల్ ప్లాజాకు చేరుకోవడానికి ముందు 60 నిముషాల కంటే ఎక్కువ కాలం ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే, అది తెలిసి కూడా 10 నిముషాల పాటు బ్లాక్‌లిస్ట్‌లోనే కొనసాగితే పేమెంట్ రిజెక్ట్ అవుతుంది.
అందుకే ఎప్పటికప్పుడు ఫాస్ట్ ట్యాగ్‌ను చెక్ చేసుకోవాలి. ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్‌లిస్ట్‌లో చేరడానికి 60 నిముషాల ముందు లేదా టోల్ దగ్గర స్కాన్ చేసిన 10 నిముషాలలోపు (మొత్తం 70 నిముషాల్లో) రీచార్జ్ చేసుకోవాలి. ఇలా చేస్తే లావాదేవీలు సక్సెస్ అవుతాయి.
అదనపు భారం ఉండదు. అదొక్కటే కాదు, కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయకపోవడం, ఛాసిస్ నంబర్‌కు, వెహికల్ నంబర్‌కు మధ్య తేడా ఉన్నా, ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్తుంది. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వాహనదారులంతా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఫాస్టాగ్ ఇబ్బందుల్లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది.