పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : వానా కాలం పంటల సాగుకు అవసరమైన యూరియా (Urea) కోసం రైతులకు ఇంకా యాతన తప్పడం లేదు. గత కొన్ని రోజులుగా యూరియా కోసం ఎదురు చూసిన రైతులు పెద్దపల్లి (Peddapalli) మండలంలో పలు ప్రాంతాల్లో యూరియా వచ్చిందని తెలియడంతో కేంద్రాల వద్దకు ఈ రోజు పెద్ద ఎత్తున చేరుకున్నారు. యూరియా ఇస్తున్నారనే సమాచారం మేరకు వివిధ ప్రాంతాల నుండి రైతులు (Farmers) ఆయా పంపిణీ కేంద్రాలకు భారీ సంఖ్యలో చేరుకుని పట్టా పాసు పుస్తకాలతో క్యూలైన్లలో వేచి ఉన్నారు.
పెద్దపల్లి (Peddapalli) పట్టణం శాంతినగర్ గ్రోమోర్ కేంద్రం, పెద్దపల్లి మండలం కాసులపల్లి, హన్మతునిపేట్ గ్రామాల్లో డీసీఎంఎస్ ద్వారా, పెదబొంకూర్ ప్రైవేట్ దుకాణం ద్వారా 22 టన్నులు, ప్రైవేట్ దుకాణాల్లో మరో 30టన్నులు యూరియా పంపిణీ చేశారు. వ్యవసాయ అధికారుల సమక్షంలో రైతులకు యూరియా పంపిణీ (farmers Distribution urea) చేశారు. మరిన్ని యూరియా నిల్వలు పెద్దపల్లిలో రానున్నాయని రైతులందరికీ యూరియా లభిస్తుందని, ఎవరు ఆందోళన చెందవద్దని వ్యవసాయశాఖ అధికారి కోరారు.