త్రీఫేస్ కరెంట్ సమస్యపై రైతుల ధర్నా…

త్రీఫేస్ కరెంట్ సమస్యపై రైతుల ధర్నా…
- సమస్య పరిష్కారానికి అధికారుల హామీ
కౌకుంట్ల, ఆంధ్రప్రభ : త్రీఫేస్ కరెంట్ సరఫరా సరిగా లేకపోవడంతో రైతులు గురువారం కౌకుంట్ల సబ్‌స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు.పేరూరు సబ్‌స్టేషన్ ద్వారా కరెంట్ సరఫరా జరుగుతున్నప్పటికీ త్రీఫేస్ సరిగా అందకపోవడంతో వెంకటగిరి, ఇస్రంపల్లి గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతు సంఘం నాయకుడు కొండారెడ్డి నాయకత్వంలో రైతులు సబ్‌స్టేషన్ ముందు దాదాపు అరగంట పాటు కూర్చొని ఆందోళన చేపట్టారు. ఏఈ రావాలని, వెంటనే కరెంట్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అయితే ఏఈ ఫోన్‌లో మాట్లాడుతూ ప్రస్తుతం విద్యుత్ పనుల్లో ఉన్నానని, రైతుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు. తర్వాత ఈడి రైతులతో మాట్లాడి పేరూరు సబ్‌స్టేషన్‌లో లో వోల్టేజ్ సమస్య ఉన్నదని తెలిపారు. దానికి అవసరమైన మెటీరియల్ వచ్చిందని, ఈరోజు సాయంత్రానికి అమర్చించి రేపటిలోగా కరెంట్ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం రైతులు అక్కడున్న ఆపరేటర్‌కు వినతి పత్రం అందజేశారు. అలాగే స్థానిక కౌకుంట్ల ఎమ్మార్వోకు కూడా మెమోరాండం ఇచ్చారు. ఎమ్మార్వో మాట్లాడుతూ ఏఈతో మాట్లాడి కరెంట్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని రైతులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో పి. శివారెడ్డి, రాజేందర్ రెడ్డి, ఎల్. శ్రీనివాస్ రెడ్డి, పి. రాజేశ్వర్ రెడ్డి, తిరుపతిరెడ్డి, మల్లేష్, బాల్రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, కే. రాజు తదితరులు పాల్గొన్నారు.
