MDK | వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి.. రైతుల రాస్తారోకో

వెల్దుర్తి : అధికారులు హంగు ఆర్భాటాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, తూకం వెయ్యడం పూర్తిగా మరిచిపోయారంటూ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహించిన వెల్దుర్తి మండలంలోని ఉప్పు లింగాపూర్ గ్రామ రైతన్నలు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వెల్దుర్తి – మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా బస్సులు, ట్రాక్టర్లు, భారీ వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ… గ్రామంలో ధాన్యం కోతలు ప్రారంభమై నెలరోజులు గడుస్తుందని ఈనెల 17న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు కొనుగోలు చేపట్టడం పూర్తిగా మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజుల నుండి ధాన్యం కుప్పలపై రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న టాపర్లు పూర్తిగా చినిగిపోయి మళ్లీ కొత్తవి కొనుక్కునే దుస్థితి రైతులకు ఏర్పడిందని కొంతమంది రైతులు టాపర్ల కిరాయిలు కట్టలేని పరిస్థితి ఏర్పడిందని తీవ్రంగా మండిపడ్డారు.

కొంతమంది పేద రైతులు దళారులను ఆశ్రయించి 1800 రూపాయలకు క్వింటాలు ధాన్యాన్ని విక్రయించి తీవ్రంగా నష్టపోయారన్నారు. సోమవారం రాత్రి గ్రామానికి వచ్చిన హమాలీలను పిఎసిఎస్ సిబ్బంది బండ పోసానిపల్లి గ్రామానికి తరలించారు. ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని సహకార సంఘం సిబ్బందిని కోరినా స్పందించలేదన్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించామన్నారు. అకాల వర్షాలు ఈదురుగాలులతో ధాన్యం తడిసి ముద్దవుతుందని, తిండి తిప్పలు లేకుండా రాశుల వద్దే కాపలా ఉండాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడిందని వాపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, సహకార సంఘం సిబ్బంది గ్రామానికి చేరుకొని రైతులతో మాట్లాడి గ్రామం నుండి వెళ్లిన హమాలీలను వెనక్కి రప్పించారు. దీంతో రైతులు ఆందోళన విర‌మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *