రోడ్డెక్కిన ఎమ్మెల్యేలు

- యూరియా కృత్రిమ కొరతపై రాస్తారోకో..!
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : యూరియా (Urea) కోసం రైతులు తెల్లవారకముందే బారులు తీరుతూ పడరాని పాట్లు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో రైతుల నిరసనలు తారస్థాయికి చేరుకున్నాయి. యూరియా కొరతను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడుతూ సోమవారం కొమరం భీం (Komaram Bheem) జిల్లాలో ఎమ్మెల్యేలు రోడ్డెక్కి నిరసన బాట పట్టారు.
కాగజ్ నగర్ లో ఆందోళన…
యూరియాను ప్రభుత్వం బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తోందని సిర్పూర్ టి ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు (Harish Babu) ధ్వజమెత్తారు. ఒక బస్తా యూరియా కోసం రైతులు వ్యవసాయ పనులు మాని, పస్తులతో బారులు తీరుతున్నారన్నారు. పంట అదును దాటిన తర్వాత యూరియా వస్తే ఏం లాభమని ప్రశ్నించారు. కేంద్రం సబ్సిడీ (subsidy) తో రూ.266 బస్తా రైతులకు ఇస్తుంటే, రూ.600 కు బయట మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. అనంతరం రైతులతో కలిసి మార్కెట్ యార్డ్ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఎమ్మెల్యే హరీశ్ బాబును బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. రెండు రోజుల్లో యూరియా (Urea) కొరత తీరుస్తామని అధికారులు నచ్చి చెప్పడంతో ఆందోళన విరమించారు.
ఆసిఫాబాద్ లో ఎమ్మెల్యే కోవలక్ష్మి నిరసన
ఆసిఫాబాద్ జిల్లా (Asifabad District) కేంద్రంలో యూరియా కొరతపై రైతులు ప్రాథమిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద నిరసన తెలిపారు. అక్కడి ఎమ్మెల్యే కోవలక్ష్మి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా కొరతను సృష్టించి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే యూరియా ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
