మొక్కజొన్న పంట దళారీల పాలేనా…?

మొక్కజొన్న పంట దళారీల పాలేనా…?
రైతుల్ని ప్రభుత్వం ఆదుకోదా…..?
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము
శావల్యాపురం, ఆంధ్రప్రభ : రైతన్న తన రక్తాన్ని చెమటగా చిందించి పండించిన మొక్కజొన్న పంట దళారీల పాలవుతుందని రాష్ట్ర రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము అన్నారు. రైతుల్ని ప్రభుత్వం ఆదుకోదా….అని ప్రశ్నించారు. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలంలో బుధవారం రాష్ట్ర రైతు సంఘం బృందం పర్యటించి మొక్కజొన్న రైతులతో కలిసి మాట్లాడారు. పొట్లూరు గ్రామంలో మొక్కజొన్న పండించిన రైతులను కలిసి కల్లాలపై ఆరబోసిన మొక్కజొన్నను పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడగా బయట మార్కెట్లో రూ.1700 లకు కొనుగోలు చేస్తున్నారని ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి ధరకు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తే రైతుకు పది రూపాయలు మిగులుతాయని లేకపోతే రైతుల కష్టం దళారీల పాలవుతుందని ఉలవలపూడి రాము కి చెప్పి వారి యొక్క ఆవేదనను వెల్లబోసుకున్నారు. రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎండనకా వాననక ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ప్రభుత్వం ఆదరణ లేకపోవడంతో దళారీలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారైందని దళారీలకు కళ్లెం వేయాలంటే రైతులు పండించిన ప్రతి పంట ప్రభుత్వమే రైతు సేవ కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని అన్నారు.

పల్నాడు జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ముఖ్యమైన ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎమ్మెస్పి ధర రూ.2400 ఇచ్చి వెంటనే కొనుగోలు చేయాలని లేనిచో రైతుల ఆవేదనకు ప్రభుత్వం గురవుతుందని హెచ్చరించారు. రైతులు కూడా తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి రాయబారం వందనం, మండల నాయకులు చీరాల ఆంజనేయులు, నర్రా వెంకటరత్నం, దుర్గారెడ్డి, రైతులు గడిపూడి అంజయ్య, చింతా వీరాంజి, తూమాటి నాగేశ్వరరావు, కన్నా పున్నయ్య, అబ్బూరి రామారావు, గడిపూడి కోటయ్య, నంబూరి ఏసోబు, అంగలకుర్తి దావీదు, నాదెండ్ల వెంకటేశ్వర్లు, ఎర్రగుంట్ల హనుమంతు, ప్రభాకర్, అంజమ్మ తదితరులు ఉన్నారు.
