నేల ఆరోగ్యంపై శిక్షణా కార్యక్రమం…

నేల ఆరోగ్యంపై శిక్షణా కార్యక్రమం…
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లోని రైతు వేదికలో నేల ఆరోగ్యంపై రెండు రోజులపాటు రైతులకు శిక్షణ కార్యక్రమం అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఆత్మ), వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించారు. ఆత్మ పరకాల డివిజన్ వారి సౌజన్యంతో వ్యవసాయ శాఖ రెండు రోజుల రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు పాల్గొని, నేల ఆరోగ్యం పరిరక్షణ కొరకు రైతులు చేయవలసిన పనులు తెలియజేశారు.
ప్రధానంగా రైతులు నేలకు అవసరం మేరకు మాత్రమే దున్నుకోవాలని, ఎక్కువసార్లు దున్నినట్లైతే నెలలో సేంద్రియ కార్బన్ తగ్గిపోతుందని, అదే విధంగా వివిధ పంటలలో నత్రజని, వాడకం మెలకువలను, అది నత్రజని బురద పదనులో వేసుకోవాలని వీలైనంత మేరకు ఎక్కువసార్లు వేసుకోవాలని సూచించారు. భాస్వరం ఎరువులను దుక్కిలో మాత్రమే వేసుకోవాలని, పొటాషియం తప్పక రైతులు అన్ని పంటలలో సిఫారసు మేరకు వేసుకోవాలని, ముఖ్యంగా రైతులు వివిధ పంటల వచ్చేటువంటి అవశేషాలను కాల్చకుండా నేలలో కలియదున్నాలని తద్వారా నేలలో కార్బన్ వృద్ధి చెంది నేలలో సూక్ష్మజీవులు సాంద్రత మరియు పనితనం పెరిగి పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుందని సూచించారు.
అదేవిధంగా రైతులు రాబోయే రబీ పంట తర్వాత విధిగా భూసార పరీక్షలు తప్పనిసరి చేయించుకోవాలని, పరీక్ష ఆధారిత ఎరువులను వివిధ పంటలలో వాడినట్లయితే నేల ఆరోగ్యం తో పాటు రైతులకు ఆర్థికంగా లాభంగా ఉంటుందన్నారు. నేల నీటి వాతావరణ కాలుష్యం తగ్గించే అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరకాల ఏడిఏ కె జగదీశ్వర్ రెడ్డి , పరకాల ఏవో ఎస్ శ్రీనివాస్, ఏ ఈ ఓ లు శైలజ, రజాక్ , కాటంరాజ, మరియు రైతులు పాల్గొన్నారు.
