Farmer | రైతులకు ఇబ్బందులు పెట్టొద్దు
- రైతు సేవా కేంద్రంలో నిర్ధారించిన తేమ శాతానికే మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
- సీపీఐ జిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు
- రైతు సంఘం రాష్ట్ర నాయకులు హనుమానుల సురేంద్రనాథ్ బెనర్జీ
Farmer | చల్లపల్లి, ఆంధ్రప్రభ : రైతు సేవా కేంద్రంలోని నిర్ధారించిన తేమ శాతానికే మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రైతులను ఇబ్బందులు పెట్టొద్దని సీపీఐ కృష్ణాజిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు హనుమానుల సురేంద్రనాథ్ బెనర్జీ అన్నారు. చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో సీపీఐ అవనిగడ్డ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా విచ్చేసిన నాయకులు మాట్లాడుతూ..
రైతు సేవా కేంద్రంలో నిర్ధారించిన తేమ శాతానికన్నా మిల్లర్లు ఐదు శాతం తక్కువ కు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఘంటసాల మండలంలో ఇటీవల ఒక రైతు సేవా కేంద్రం నిర్ధారించిన తేమశాతంతో లారీ మిల్లుకు పంపగా, దానికి ఐదు శాతం తక్కువకు కొనుగోలు చేస్తానని చెప్పడంతో రైతుకు మిల్లర్‌కు మధ్య వాగ్వాదం జరిగిందన్నారు. దీంతో లారీని వెనక్కి తిప్పి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల సంభవించిన తుఫాను కారణంగా ఎకరానికి 10 నుంచి 15 బస్తాలు దిగుబడి తగ్గిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతుకు అండగా నిలవకుంటే వ్యవసాయ రంగం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు సంచులు అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు అందని సంచులు దళారులకు దర్జాగా దొరుకుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతు సేవా కేంద్రంలో నిర్ధారించిన తేమ శాతానికి మిల్లర్లు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ బాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుత్తికొండ రామారావు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మల్లుపెద్ది రత్నకుమారి, పార్టీ నాయకులు మాలెంపాటి కోటేశ్వరరావు, కొల్లూరి శ్రీధర్, కోదాటి నాగయ్య, పెనుమత్స రాజారత్నం, కోడి రాధాకృష్ణ, సిద్దాబత్తుల వాసు, హేమార్జున తదితరులు పాల్గొన్నారు.

