నంద్యాల బ్యూరో, ఏప్రిల్ 14 (ఆంధ్రప్రభ ) : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల తిరుపతి దేవస్థానంపై భూమన కరుణాకరరెడ్డి తప్పుడు ప్రచారం చేయడం తగదని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరుణాకరరెడ్డి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అదో నల్లరాయి దాని మీదకు చెప్పు విసిరితే ఏమవుతుందంటూ గతంలో వెంకటేశ్వరస్వామిపై అనేక విమర్శలు చేసిన కరుణాకర్ రెడ్డి మరోసారి దుష్ప్రచారానికి తెరలేపారని పేర్కొన్నారు.
ప్రజల్లో అలజడి సృష్టించేందుకు, ప్రశాంతతకు భంగం కలిగించేందుకు టీటీడీపై రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. గోశాలలో వంద ఆవులు చనిపోయాయంటూ కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. గోశాలలోని ఆవులు వృద్ధాప్యం, డెలివరీ సమయంలో, వ్యాధులతో నెలకు సగటున 10ఆవుల వరకు మృత్యువాత పడుతుంటాయని, ఇవి గత అయిదేళ్ల గణాంకాలు చూస్తే స్పష్టమవుతుందని వివరించారు. కరుణాకరరెడ్డి ప్రెస్ మీట్ లో చనిపోయినట్లు చూపించిన ఆవుల ఫోటోలు ఇక్కడివి కాదు, ఎక్కడివో అని.. వాటిని అడ్డుపెట్టుకుని టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. టీటీడీ గోశాలలో 260మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తూ గోవుల సంరక్షణను సక్రమంగా చూసుకుంటుంటే టీటీడీ పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. గోశాలలోని 2,668 ఆవులకు జియో ట్యాగ్ చేసి ప్రతిరోజూ పర్యవేక్షించడం జరుగుతుంటే ఆవులకు జియోట్యాగ్ తీసేశారంటూ విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గోశాలను గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ఇప్పుడు అధునాతన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిరోజూ శుభ్రపరచడం, బ్లీచింగ్ చేయడం జరుగుతోందని చెప్పారు. సహజ మరణం పొందిన ఆవులకు పోస్టుమార్టం చేయడం ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదని, ఏదైనా ప్రమాదంతో గానీ, అనుమానాస్పదంతో జరిగితే తప్పనిసరిగా పోస్టుమార్టం చేయడం జరుగుతోందని స్పష్టం చేశారు.
జనన, మరణాల రిజిష్టర్ ను గోసంరక్షణ శాలలో ప్రతిరోజూ క్రమం తప్పకుండా నమోదు చేస్తున్న విషయం తెలిసికూడా దురుద్దేశపూర్వకంగా రిజిష్టర్ లో నమోదు చేయడం లేదంటూ వ్యవస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నేను నాస్తికుడినని స్వయంగా కరుణాకరరెడ్డి ప్రకటించుకున్న విషయం వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సమయంలో ప్లాస్మా టీవీల కుంభకోణం, తాళిబొట్ల కుంభకోణం, టిక్కెట్లు అమ్ముకోవడం, డాలర్లు మాయం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడలేదా? అని ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో స్వామి వారి ప్రసాదాలను కూడా దారిమళ్లించి అపచారాలకు పాల్పడిన చరిత్ర కరుణాకరరెడ్డిది కాదా? అన్నారు. కరుణాకరరెడ్డి కుమార్తె నీహారెడ్డి పెళ్లిని క్రైస్తవ మత ఆచారాలతో చేసిన మాట వాస్తవం కాదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరుణాకరరెడ్డి అవినీతి, అక్రమాలతో టీటీడీ ఖజానాను దారిమళ్ళించి కమీషన్లు కొట్టేశారని, తిరుపతి కొండపై అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించింది, ఏడుకొండలను 5 కొండలుగా మార్చి కుట్ర చేసింది, టీటీడీని కూడా ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చే చర్యలకు పాల్పడింది నువ్వు కాదా? అని దుయ్యబట్టారు. చేసిన తప్పుడు పనులకు విధుల దూరమైన హరనాధ్ రెడ్డి అనే వ్యక్తి కోసం టీటీడీపై తప్పుడు ప్రచారాలు చేస్తారా? మత విద్వేషాలు రెచ్చగొడుతున్నందుకు, టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు పోలీసులు పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.