Fake Videos | కేసు కొట్టివేతకు హై కోర్టు నో … విచారణకు సహకరించాలని క్రిశాంక్ కు ఆదేశం

హైదరాబాద్ – కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి నకిలీ వీడియోలను పోస్టు చేశారన్న కేసులో పోలీసులకు సహకరించాలని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్‌ను హైకోర్టు ఆదేశించింది. 400 ఎకరాల భూముల విషయంలో నకిలీ ఏఐ వీడియోలు, చిత్రాలను పోస్టు చేశారంటూ ఆయనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు.

ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మన్నె క్రిశాంక్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం పోలీసుల విచారణకు సహకరించాలని ఆయనను ఆదేశించింది. అలాగే కొణతం దిలీప్‌నకు నోటీసులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఒకే ఘటనపై నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది రమణారావు కోర్టుకు తెలియజేశారు. రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టారని ఆయన కోర్టుకు తెలిపారు. కంచ గచ్చిబౌలి భూముల ఘటనపై ఏఐ వీడియోలు, పోస్టులు చేసి వైరల్ చేశారని, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Leave a Reply