Fake Drugs Seized | మెడిక‌ల్ షాపుల‌తో త‌నిఖీలు .. భారీగా న‌కిలీ మందులు ప‌ట్టివేత

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లో డ్రగ్ కంట్రోల్ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వరంగల్ , అసిఫాబాద్ , నిజామాబాద్ జిల్లాలో ఆర్ఎంపీ, మెడికల్ షాపులపై తనిఖీలు నిర్వహించారు. వరంగల్ గిర్మాజిపేటలో సాయికిరణ్ పౌల్ట్రీ, వెటర్నరీ మెడికల్ షాపుపై తనిఖీలు చేశారు. గుర్తింపు లేని, నకిలీ వెటర్నరీ మందులు పెద్ద మొత్తంలో స్టాక్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రూ. 2.5 లక్షల విలువైన 26 రకాల వెటర్నరీ మందులు సీజ్ చేశారు. అసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో మెడికల్ షాపులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జ్వరానికి పని చేస్తుందని చెబుతూ అమ్ముతున్న నకిలీ ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్లటోకోర్ టోటల్ సిరప్‌ను సీజ్ చేశారు.

ఆల్ఫాజోలం అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు..

అలాగే నిజామాబాద్‌లో నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫాజోలం అమ్ముతున్న ముఠా గుట్టును యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ బృందం రట్టు చేసింది. మహారాష్ట్ర కేంద్రంగా ఆల్ఫాజోలం తయారు చేసి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అమ్ముతున్న మూడు కంపెనీలను అధికారులు మూసివేశారు. సుమారు రూ. 7 కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేశారు. దీనికి సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారయ్యారు. నార్కోటిక్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయితే ఆస్తులను సీజ్ చేస్తామని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *