Fake ACB | నకిలీ ఏసీబీ ట్రాప్‌లో సబ్ రిజిస్ట్రార్

Fake ACB | నకిలీ ఏసీబీ ట్రాప్‌లో సబ్ రిజిస్ట్రార్

Fake ACB | నర్సాపురం, ఆంధ్రప్రభ : ఇటీవల కాలంలో నకిలీలు బెడద ఎక్కువైంది. నకిలీల ఉచ్చులో చదువు లేనివారికన్నా విద్యావంతులే అధికంగా ట్రాప్‌లో పడిపోతున్నారు. అధికారులు సైతం మోసపోతున్నారు. గత వారంలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఏసీబీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యాయి. దీనిని ఆసరాగా తీసుకున్న కేటుగాళ్లు జిల్లాలోని కొంతమంది సబ్ రిజిస్ట్రార్‌లకు ఏసీబీ అధికారులమంటూ ఫోన్ చేసి ట్రాప్‌లో దింపే ప్రయత్నాలు చేశారు. వీరి వలకు మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ సబ్బితి శ్రీనివాస్ చిక్కారు.

నిన్న ఆయనకు ఏసీబీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, మొగల్తూరు కార్యాలయంలో ఆకస్మిక దాడులు జరగనున్నాయి అని ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. రైడ్ జరగకుండా ఉండాలంటే రూ.3 లక్షలు బ్యాంకు ఖాతాకు తక్షణమే బదిలీ చేయాలని హుకుం జారీ చేశాడు. సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ కార్యాలయం నుంచే ఫోన్ వచ్చింది అనుకుని ఆయన బ్యాంక్ ఖాతా నుంచి రూ లక్ష, ఇతరులు ఖాతా నుంచి కొంతకొంతగా మరో రూ.లక్షను నకిలీల ఖాతాలోకి బదిలీ చేశారు. మిగతా సొమ్ము రూ.లక్ష కూడా ఇప్పుడే ట్రాన్సఫర్ చేయమని గట్టిగా అడగడం తో ఆయనకు కొంత అనుమానం వచ్చి తెలిసిన వారిని సంప్రదించారు.

ఏసీబీ కార్యాలయం నుంచి ఫోన్ చేయలేదని, అలా జరగదు కూడా అని చెప్పడంతో నకిలీలు చేతిలో మోసపోయినట్లు గ్రహించాడు. వెంటనే మొగల్తూరు పోలీస్ స్టేషన్‌లో సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సొమ్ము బదిలీ అయిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. విచారణ చేయగా అనంతపురం బ్యాంకు ఖాతాకు రూ.లక్ష బదిలీ అయినట్లు తెలిసింది. మరో రూ.లక్ష జమ అయిన ఖాతాలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఘటనతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఉలిక్కి పడ్డారు. అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply