సింగరేణి కార్మికులకు పునరావాసం కల్పించాలి..

సింగరేణి కార్మికులకు పునరావాసం కల్పించాలి..
సింగరేణి కార్మికులు, పునరావాసంపై ఎమ్మెల్యే జిఎస్సార్ ప్రస్తావన
శాసనసభలో ప్రభుత్వ దృష్టికి పలు సమస్యలు
ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు బుధవారం శాసనసభలో మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలు, గని ప్రభావిత గ్రామాల పునరావాసం, నిరుద్యోగులకు అవకాశాలు వంటి పలు కీలక అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. సింగరేణి సంస్థలో పనిచేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులను మెడికల్ అన్‌ఫిట్‌గా ప్రకటించి, వారి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు.
కరోనా సమయంలో విధులకు హాజరు కాలేదనే కారణంతో డిస్మిస్ అయిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి ఉద్యోగుల సొంతింటి కలను నెరవేర్చేలా గృహ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. గడ్డిగానిపల్లి, కొండపల్లి వంటి ఉపరితల గని ప్రభావిత గ్రామాలను పునరావాసం కల్పిస్తూ తరలించాలని అన్నారు.
లొంగిపోయిన నక్సలైట్లకు గృహ వసతి, వ్యవసాయ భూమి కేటాయించాలని, చెల్పూర్ జెన్కో నుంచి విడుదల అవుతున్న బూడిదతో ఇబ్బంది పడుతున్న దుబ్బపల్లి గ్రామాన్ని తరలించాలని కోరారు. భూపాలపల్లి మండలంలోని గొల్ల బుద్దారం, అజాంనగర్, నందిగామ, రాంపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన కొత్తపల్లి గోరి మండలంలో పోలీస్ స్టేషన్ భవనం లేకపోవడంతో నూతన భవనానికి మంజూరి ఇవ్వాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జీఎస్ఆర్ ప్రభుత్వాన్ని కోరారు.
