పోస్టల్ బ్యాలట్ కోసం ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు

  • జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

జనగామ, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు నిర్వహించనున్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు.

మొదటి, రెండవ, మూడవ విడతలుగా జరిగే గ్రామ పంచాయితీ ఎన్నికలకు సంబందించిన పోలింగ్ లో ఆయా మండలాల్లో ఓటరుగా నమోదై, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు తాము ఓటరుగా నమోదైన సంబంధిత మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు.

మొదటి విడత పోలింగ్ వారికి డిసెంబర్ 9 న, రెండవ విడత పోలింగ్ వారికి డిసెంబర్ 12 న , మూడోవ విడత పోలింగ్ వారికి డిసెంబర్ 15 న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిర్వహిస్తారన్నారు. అన్ని మండలాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయబడినట్లు, ఓటర్ల జాబితా, వార్డు నంబర్ వివరాలు తెలియజేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు కలెక్టర్ తెలియజేశారు.

మొదటి విడత ఎన్నికలు జరిగే చిల్పూర్ ఎంపీడీవో ఆఫీస్, ఘన్పూర్ రైతు వేదిక, జాఫర్గడ్ లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్, లింగాల ఘనపూర్ లోని ఎంపీడీఓ ఆఫీస్,రఘునాథపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోస్టల్ బ్యాలట్ ని వినియోగించుకోవచ్చన్నారు.

ఈ సదుపాయం వినియోగించుకోవడానికి ఉద్యోగులు తమ ఎన్నికల విధుల అపాయింట్మెంట్ ఆర్డ్‌ర్ కాపీతో పాటు వోటర్ ఐడీ జిరాక్స్ లేదా ఏదైనా ఒక గుర్తింపు కార్డును జతచేసి సంబంధిత ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. ధృవీకరణ అనంతరం వారికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేస్తారని ఓటు వేసిన తరువాత బ్యాలెట్‌ను నిర్దేశించిన కవర్‌లో ఉంచి, అక్కడ ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సులో వేయాల్సిందిగా సూచించారు.

Leave a Reply