AP | బస్టాండ్లో విస్తృత తనిఖీలు

AP | బస్టాండ్లో విస్తృత తనిఖీలు
AP | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతా వ్యవస్థను పటిష్ఠం చేస్తూ పోలీసులు (police) అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలో కర్నూలు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలుగా విస్తృత తనిఖీలు నిర్వహించారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ (SP Vikrant Patil) ఆదేశాల మేరకు, కర్నూలు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బస్టాండ్ ఆవరణలో నెలల తరబడి ఉంచిన బైక్లు, కార్లు, పార్సిల్ రవాణా కార్యాలయాలు, లగేజీలను బాంబ్ స్క్వాడ్, పోలీసు ప్రత్యేక బృందాలు సమగ్రంగా పరిశీలించాయి.
కర్నూలు (Kurnool) పట్టణ సీఐలు నాగరాజారావు, మన్సురుద్దీన్, నాలుగో పట్టణ ఎస్సై శ్రీనివాసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రయాణికుల సామాన్లు, అనుమానాస్పద వ్యక్తులు, పార్సిల్ ప్యాకేజీలను క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు.ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే డయల్ 112 లేదా డయల్ 100కు సమాచారమివ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. భద్రత అందరి బాధ్యతగా పౌరులు కూడా సహకరించాలని సూచించారు.

