AP | ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు గడువు పదేళ్లకు పెంపు !
- ప్రైవేట్ పాఠశాలల సంఘాలతో మంత్రి లోకేష్ భేటీ..
- విద్యా వ్యవస్థలో సంస్కరణలకు ప్రణాళికలు సిద్ధం
- ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే వర్క్ షాప్
- ఇంజినీరింగ్ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం
ఏపీలోని ప్రైవేట్ పాఠశాలలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు కాలాన్ని పదేళ్లకు పెంచుతామని వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ ఇవాళ ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రైవేట్ పాఠశాలల సంఘాల ప్రతినిధులు, యాజమాన్యాలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల సంఘం ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వారి వినతులపై సానుకూలంగా స్పందించిన మంత్రి నారా లోకేష్… ఆయా సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రెండు మూడు రోజుల్లో ఆర్టీఎఫ్ స్కాలర్‌షిప్ నిధులు..
విద్యారంగంలో ప్రైవేటుకు, ప్రభుత్వానికి బాధ్యత ఉందని… పోటీపడదాం.. అందరం కలిసి విద్యావ్యవస్థను బలోపేతం చేద్దాం అని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఆర్టీఎఫ్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి మొదటి విడతగా రూ.788 కోట్లకు గాను.. ఇప్పటికే రూ.571.96 కోట్లు విడుదల చేశామని, మిగిలిన రూ.216.04 కోట్లు రెండు, మూడు రోజుల్లో విడుదల చేస్తామన్నారు.
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లు, ఆర్‌అండ్‌డి, ఆవిష్కరణలపై దృష్టి సారించాలని… రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్లేస్‌మెంట్ వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయాలని మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీల అధికారులను మంత్రి లోకేష్ కోరారు.
ఎన్నికల కోడ్ తర్వాత ఇంజినీరింగ్ విద్య నాణ్యతపై వర్క్ షాప్.
విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. యువగళం పాదయాత్రలో ఉపాధ్యాయుల సమస్యలు నా దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించి ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత పెంచేందుకు అందరి అభిప్రాయాలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
ప్రైవేట్ పాఠశాలల సంఘం ప్రతినిధుల వినతులు..
- ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును పదేళ్లకు పెంచాలి.
- క్యాంపస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి.
- ఫైర్ సర్టిఫికెట్, స్ట్రక్చరల్ ఎన్వోసీ, శానిటేషన్ సర్టిఫికెట్ మంజూరును సులభతరం చేయాలని.
- ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్లకు గుర్తింపు ఇవ్వాలని కోరారు.
- ప్రీ-ప్రైమరీ పాఠశాలలకు గుర్తింపు ఇవ్వాలని కోరారు.
- ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి.
- ఓపెన్ స్కూల్స్ కు కూడా గుర్తింపు గడువును పదేళ్లకు పెంచాలి.
- కరోనా సమయంలో రెండేళ్ల పాటు నిరుపయోగంగా ఉన్న ప్రైవేటు స్కూల్ బస్సులకు రెండేళ్ల పాటు కాలపరిమితి పెంచాలి.
- స్కూల్ బస్సుల విషయంలో పన్నుల భారాన్ని తగ్గించాలని కోరారు.
- ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కూడా ప్రతిభా పురస్కారాలు అందజేయాలి.
- ప్రైవేటు స్కూల్స్ ను కేటగిరైజ్ చేసే అంశాలన్ని పరిశీలించాలని సూచించారు.
- ప్రేవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా శిక్షణ తరగతులు నిర్వహించాలి.
- ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలిసి క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలి.
- తెలుగు మీడియం ప్రైవేటు పాఠశాలలు 150 వరకు ఉన్నాయని, వాటిని ఇంగ్లీషు మీడియంగా కన్వర్షన్ చేయాలని అభ్యర్థించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పర్చూరి అశోక్ బాబు, వేపాడ చిరంజీవి, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసిరెడ్డి విద్యాసాగర్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.