న్యూఢిల్లీ : భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే సరుకులపై 25 శాతం టారిఫ్ విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో, భారత ప్రభుత్వం దీనిపై స్పందించింది. ట్రంప్ ప్రకటనపై కేంద్ర వాణిజ్య శాఖ స్పందిస్తూ — దాని ప్రభావాలను గమనిస్తున్నామని, జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
“అమెరికా అధ్యక్షుడి ప్రకటనపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. దాని ప్రభావాలపై పరిశీలన జరుగుతోంది. గత కొన్ని నెలలుగా భారత్–అమెరికా మధ్య న్యాయమైన, సమతుల్యమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ లక్ష్యానికి మేము కట్టుబడి ఉన్నాం,” అని కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో వెల్లడించింది.
వ్యవసాయదారులు, చిన్న, మధ్య తరహా వ్యాపారవేత్తలు (MSMEs) వాణిజ్య మార్పులకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆ రంగాలు బలయ్యే పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్రం తెలిపింది.
ఈ సందర్భంగా కేంద్రం ఇటీవలి యూకేతో కుదిరిన ‘కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (CETA)’ ఒప్పందాన్ని ప్రస్తావించింది. “ఇంగ్లాండ్‌తో కుదుర్చుకున్న ‘కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (CETA)’ మాదిరిగా, భారత్ జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది,” అని వాణిజ్య శాఖ ప్రకటించింది.