పాకిస్తానీయుల గుండెల్లో దడదడ
ఆకలిదప్పులకు అలమటించాల్సిందేనా?
రావి, సట్లేజ్, బియాస్ ఆగితే గతేంటి
330 లక్షల ఎకరాల్లో సాగు కన్నీరే
24 కోట్ల మందికి తాగునీరు కరువు
ఇదీ పాక్ స్వయం కృతం అంటున్న పరిశీలకులు
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : ఉగ్ర ఆగడాలను సహించలేని స్థితిలో.. ఉగ్రమూకలతో పరోక్ష యుద్ధం చేస్తున్న పాకిస్థాన్‌పై భారత దళపతి బ్రహ్మాస్త్రం సంధించారు. పహల్గామ్‌లో ఉగ్ర ఊచకోతకు ప్రతీకార చర్యగా సింధూనది ఒప్పందాన్ని రద్దు చేశారు. పహల్గాంలో నరమేధంతో ప్రధాని మోదీ చలించిపోయారు. అమెరికా ఉపాధ్యక్షుడి కుటుంబం భారత పర్యటనకు వస్తే.. వారికి అతిథి మర్యాదలు అందిస్తున్న సమయంలో.. ఉగ్రమూక చెలరేగిపోవాటాన్ని జీర్ణించుకోలేక పోయారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ తీవ్రంగా స్పందించారు. బాధితులను స్వయంగా ఓదార్చారు. ఢిల్లీ లోక్ నాయక్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) భేటీ జరిగింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ సింధూనదీ జలాల ఒప్పందం నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఏక నది ఆధారిత పాకిస్థాన్‌పై భారత్ ప్రకటించిన పరోక్ష యుద్ధం ఫలితం ఊహిస్తేనే భయానకంగా ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. భారత్ తీసుకున్న తీవ్ర నిర్ణయంతో పాక్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
సింధు జలాల ఒప్పందమేంటీ ?
అంతర్జాతీయ నదీజలాల పంపిణీలో సింధు జలాల ఒప్పందం ఒక గొప్ప ఉదాహరణ .. కాగా, కొన్నేళ్లుగా భారత -పాకిస్తాన్ దాయాదుల మధ్య ఎప్పుడు ఏ గొడవ జరిగినా సింధు జలాల ఒప్పందం తెరపైకి వస్తోంది. అసలు ఏమిటీ ఒప్పందం? ఈ ఒప్పందంలో ఏయే అంశాలున్నాయి? భారత్ ఏకపక్షంగా ఈ ఒప్పందం నుంచి తప్పుకునే వీలుందా? అనే అంశాలు చర్చకు వస్తున్నారు. అయితే.. భారత్, పాక్ మధ్య 1960 సెప్టెంబర్ 19న సింధు జల ఒప్పందం (ఐడబ్ల్యూటీ) జరిగింది. ఇది సరిహద్దు జలాల పంపకానికి ముఖ్యమైన ఒప్పందం. తొమ్మిది సంవత్సరాల చర్చల తర్వాత ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించి ఈ ఒప్పందంపై సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి భారతదేశం తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం, నిబంధనల ప్రకారం ఎవరైనా, ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోడమో లేదంటే మార్చడమో కుదరదు. రెండు దేశాలు కలిసి చర్చించుకుని, ఈ సంధిలో మార్పులు చేయవచ్చు లేదా ఒక కొత్త ఒప్పందం చేసుకోవచ్చు.. ఇదీ పాకిస్థాన్ వాదన.
సింధు జల హక్కులు లేవో..
ఈ ఒప్పందం ప్రకారం.. సింధు ఉప నదుల్లో తూర్పున ప్రవహించే రావి, బియాస్, సట్లేజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి. వీటి సగటు వార్షిక ప్రవాహం 330 లక్షల ఎకరాల అడుగులు (ఎంఏఎఫ్)గా ఉంది. సింధు నదితోపాటు పశ్చిమ ఉపనదులు సింధు, జీలం, చీనాబ్‌పై పాకిస్థాన్ హక్కులను కలిగి ఉంటుంది. వీటి సామర్థ్యం 135 ఎంఏఎఫ్ గా ఉంది. పాకిస్థాన్‌లో 686 లక్షల ఎకరాల్లోని భూమిలో వ్యవసాయానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పంజాబ్, సింధ్ ప్రావిన్సులలో సుమారు 671లక్షల ఎకరాల్లో వ్యవసాయానికి ఈ నదుల నుంచి మొత్తం సాగునీరు అందుతోంది. సింధూనది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంటే..పాకిస్తాన్‌లోని సారవంత నేలలు కూడా బీడు భూమిగా మారుతాయి. ఇక పాక్‌లో 24 కోట్ల మంది జనం ఉంటే.. వీరిలో 19 కోట్ల మందికి రక్షిత నీరు లభించటం లేదు. అటే.. ఆకలితో.. దప్పులతో పాకిస్థాన్ జనం అల్లాడిపోయే స్థితి ఏర్పడుతుంది.
సింధూ ఒప్పందం కుదిరిందిలా ..
1947లో బ్రిటీష్ ఇండియా విభజన సమయంలో టిబెట్ లో ప్రారంభమై భారతదేశం, పాకిస్థాన్ రెండింటి గుండా ప్రవహించే సింధు నదీ వ్యవస్థ, అప్ఘనిస్థాన్, చైనాలోని కొన్ని ప్రాంతాలను కూడా తాకుతుంది. దాదాపు 11 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సింధూనది ప్రవహిస్తుంది. ఈ ప్రాంతాలన్నీ సారవంత భూములే. 1948లో భారతదేశం పాకిస్థాన్ కు నీటి ప్రవాహాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ సమయంలో పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితి దృష్టికి సమస్యను తీసుకెళ్లింది. ఐక్యరాజ్య సమితి తటస్థ మూడవ పక్షాన్ని చేర్చుకోవాలని సిఫార్సు చేసింది. దీంతో ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకొని మధ్యవర్తిత్వం వహించింది. సంవత్సరాల చర్చల తరువాత కీలకమైన నదీ వ్యవస్థను శాంతియుతంగా నిర్వహించడానికి, నీటి వాటాను పంచుకోవడానికి 1960లో భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సింధు జల ఒప్పదంపై సంతకాలు చేశారు.
పాక్ జనాలకు తాగునీటి ఇక్కట్లు..
పాక్ నీటి అవసరాలు, వ్యవసాయ రంగానికి సింధు నది నీరే ఆధారం. సింధు ఒప్పందాన్ని నిలిపివేస్తే పాకిస్థాన్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదులు పాకిస్థాన్ ప్రధాన నీటి వనరుగా ఉన్నాయి. ఈ నదులు పది లక్షల జనాభా అవసరాలనే తీర్చగలవు. పాకిస్థాన్ లోని వ్యవసాయానికి, ముఖ్యంగా పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో వ్యవసాయానికి ఉపయోగించే నీటిలో 80శాతం సింధు నుంచే వినియోగిస్తున్నారు. పాకిస్థాన్ జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం 23శా తం వాటాను కలిగి ఉంది. పాకిస్థాన్ గ్రామీణ జనాభాలో 68 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నీటి ప్రవాహానికి ఏదైనా అంతరాయం ఏర్పడితే అది పాకిస్థాన్ వ్యవసాయ రంగానికి భారీగా నష్టం చేకూర్చుతుంది. నీటి లభ్యత తగ్గితే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ప్రభావం పడుతుంది. పంట దిగుబడి తగ్గడం, ఆహారం కొరత, ఆర్థిక అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది. పాకిస్థాన్ ఇప్పటికే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంతో ఆ దేశంలో భూగర్భ జలాలు క్షీణించడంతోపాటు వ్యవసాయ భూముల్లో నీటి సామర్థ్యం తగ్గిపోతుంది. మంగళా, టార్బెలా వంటి ప్రధాన ఆనకట్టలు కలిపి 144 లక్షల ఎకరాల అడుగులు (ఎంఏఎఫ్) మాత్రమే ప్రత్యక్ష నిల్వను కలిగి ఉన్నాయి. ఇది పాకిస్థాన్ వార్షిక నీటి వాటాలో కేవలం 10శాతం మాత్రమే. ఇక తాగునీటి పరిస్థితి మరీ దారుణం. 24 కోట్ల మంది దాహార్తిని సింధూ నది మాత్రమే తీర్చగలదు.