నిజాం రాజ్యానికే తలమానికం
50 ఏళ్లు విమాన రాకపోకలు
1946లో జెడ్డాకు ప్రయాణ సదుపాయం
చుట్టూ భారత కంచె..
సముద్ర మార్గం సున్నా
అందుకే మామునూరు ఎంపిక
ఆపరేషన్ పోలోతో ధ్వంసం
చైనా యుద్ధంలో ఇదే సురక్షిత కేంద్రం
ఇప్పుడు కొత్త హంగులకు ఏర్పాట్లు
భూసేకరణం యథాతథం
వాణిజ్యం, పర్యటక రంగాల్లో అభివృద్ధి కోసం దేశీయ విమాన సేవలను పెంచేందుకు కేంద్రప్రభుత్వం ఉడాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కొత్త విమానాశ్రయాల నిర్మాణం, పాత ఎయిర్ పోర్టుల అభివృద్ధి, విస్తరణ చేపడుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్దనగరం వరంగల్ (మామునూరు)లో మరో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. కాగా, ఈ మామునూరు విమానాశ్రయానికి చాలా చరిత్ర ఉంది. ఈ ఎయిర్ పోర్టును శత్రు స్థావరంగా భావిస్తూ భారaత వైమానిక దళం గతంలో బాంబుదాడులు జరిపింది. చైనాతో యుద్ధం సమయంలో మామూనూరు సురక్షిత స్థావరంగా భారత్ భావించింది. ఇక్కడి హ్యాంగర్లలో తమ విమానాలను భారత్ దాచి పెట్టిన చరిత్ర ఉంది. అందుకే భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందే అంతర్జాతీయ విమానాశ్రయంగా వెలిగిన మామునూరు స్థితి గతి తెలుసుకోవాల్సిందే. నిజాం రాజ్య చరిత్రను తిరగేయాల్సిందే.
– ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్ – మామూనూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు 253 ఎకరాల భూ సేకరణకు కొద్దిరోజుల కిందటే తెలంగాణ ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసింది. మామునూరు విమానాశ్రయానికి మొత్తం 1,875 ఎకరాల స్థలం ఉండేది. ఈ స్థలంలో 6.6 కిలోమీటర్ల రన్ వే, పైలట్, సిబ్బంది క్వార్టర్స్, పైలట్ శిక్షణ కేంద్రం, ఒకటి కన్నా ఎక్కువ టెర్మినళ్లు ఉండేవి. కాగా, విమానాశ్రయానికి చెందిన 468 ఎకరాల భూమిలో టీజీఎస్పీ ఫోర్త్ బెటాలియన్, పోలీస్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 700 ఎకరాల్లో ప్రభుత్వ డెయిరీ ఫామ్ ఉంది. మిగిలిన స్థలం చుట్టూ రక్షణగా ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ -ఇండియా అధికారులు ప్రహరీ నిర్మించారు. ఇక మిగిలిన దాంట్లో విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి 943.14 ఎకరాల భూమి అవసరం కాగా ప్రస్తుతం 696.14 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. దానికి తోడు అదనంగా కావాల్సిన మరో 253 ఎకరాల భూమిని అధికారులు గడ్డంలోనే గుర్తించారు. కానీ భూ సేకరణ అంశం కొన్నాళ్లుగా నలుగుతోంది. భూ నిర్వాసితులకు పరిహారం ఇచ్చి భూమిని సేకరించడం పట్ల ఆలస్యమవుతోంది. ప్రస్తుతం ఈ ఆటంకాలను అధిగమించేలా రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ఈ నేపథ్యంలో…. భూసేకరణ కోసం రూ. 205 కోట్లను విడుదల చేసింది. దీంతో భూసేకరణకు లైన్ క్లియర్ అయినట్లయింది.
సర్వేను అడ్డుకున్న రైతులు..
ఆ వెంటనే విమానాశ్రయం డీపీఆర్ రెడీ చేయాల్సిందిగా ఆర్ అండ్ బీ శాఖ, ఎయిర్ ఆథారిటీ ఆఫ్ ఇండియాను కోరింది. ఇందుకు పలు ప్రతిపాదనలను కూడా పంపింది. కానీ ఇక్కడ కథ అడ్డం తిరిగింది. వరంగల్ జిల్లాలో మామునూరు ఎయిర్ పోర్ట్ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. ఎయిర్ పోర్ట్ కు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. అలాగే, తమ భూములకు న్యాయపరమైన పరిహారాన్ని చెల్లించాలని ఆందోళనకు దిగారు. నక్కలపల్లి రోడ్డు తీయవద్దని, గుంటూరు పల్లి రైతుల డిమాండ్ చేశారు. తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళన చేశారు.
ఆద్యంత్యం ఆసక్తికరం
భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందే నిజాం రాజ్యంలో 1930లో మామునూరు ఎయిర్ పోర్ట్‌ను నిర్మించారు. నలుదిక్కులా భారత భూ భాగం కంచె మధ్యలోని హైదరాబాద్ రాజ్యానికి సముద్ర మార్గం లేదు. ఉన్నది ఒకటే మార్గం అదే ఆకాశ మార్గం. అందుకే నిజాం నవాబులు విమానాశ్రయ నిర్మాణంపైనే దృష్టి సారించారు. అప్పటి నుంచి దాదాపు 50 ఏళ్ల పాటు మామూనూరు ఎయిర్ పోర్టుకు విమానాలు వచ్చాయి. వెళ్లాయి. 1980 తరువాత ఇక్కడ వైమానిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రస్తుత తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో నిజాం రాజ్యం విస్తరించింది. దేశంలోని అతిపెద్ద సంస్థానాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఒక రాజ్యానికి ఉండే అన్నిరకాల సేవలు అంటే..సైన్యం, పోస్టల్, టెలిగ్రాఫ్, రైల్వే, వైమానిక, కరెన్సీలాంటివి ఈ సంస్థానానికి ఉండేవి. పౌర, వాణిజ్య, మిలటరీ అవసరాలకు అనుగుణంగా ఏరో డ్రోమ్, ఎయిర్ ఫీల్డ్, ఎయిర్ స్ట్రిప్, ఎయిర్ పోర్ట్ ఇలా వివిధ పేర్లతో విమానాల రాకపోకల కోసం ఏర్పాట్లు ఉన్నాయి. బేగంపేట్, హకీంపేట్, దుండిగల్, బీదర్, ఆదిలాబాద్, చికల్తాన (ఔరంగాబాద్), మామునూరు ఎయిర్ ఫీల్డ్‌లు ఇందులో ప్రధానమైనవి. చరిత్రకారులు అందించిన ఆధారాల ప్రకారం, నిజాం రాజ్యంలో వస్త్రాలు, కాగితం తయారీ, చక్కెర , ఖనిజాలు, రసాయన ఇలా వివిధ రకాల పరిశ్రమలుండేవి. వాణిజ్య సంబంధిత ఎగుమతి దిగుమతులతో పాటూ మిలటరీ సంబంధిత కమ్యునికేషన్ల కోసం తన భూభాగంలో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ల కోసం ఎయిర్ ఫీల్డ్‌లను నిర్మించారు. డెక్కన్ ఎయిర్ వేస్ పేరుతో సొంత విమాన సంస్థ ఉండేది. బ్రిటిష్ సామ్రాజ్యంలో ఆగ్నేయాసియా కమాండ్‌కు సింగపూర్ కేంద్రంగా ఉండేది. భారత్‌లో వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన విమానాలు నిజాం రాజ్యంలోని ఎయిర్ స్ట్రిప్‌లలో విశ్రాంతి, ఇంధనం కోసం ఆగేవి. 1946 లోనే హజ్ యాత్ర కోసం జెడ్డా వరకు డెక్కన్ ఎయిర్ వేస్ ప్రత్యేక చార్టర్ విమానాలను నడిపింది.
ఆపరేషన్ పోలో..
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. చివరి నిజాం రాజు తన రాజ్యాన్ని భారత్, పాకిస్తాన్ రెండింటిలోనూ విలీనం చేయలేదు. తటస్థంగా ఉన్నారు. ఈ సమయంలోనే భారత యూనియన్‌తో ఏడాది కాలానికి యధాతథ స్థితి ఒప్పందం కుదుర్చుకున్నారు.ఈ సమయంలో హైదరాబాద్‌ను స్వతంత్య్ర దేశంగా గుర్తించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని నిజాం సర్కారు ప్రతినిధి బృందం ఆశ్రయించింది భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ రాజ్యంలోకి దిగుమతయ్యే వివిధ రకాల సరుకులపై ప్రభావం పడింది. ముఖ్యంగా ఆయుధాలు, మందుగుండు, పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్కువగా ఈ ప్రభావం ఉంది. ఆ సమయంలో బియ్యం, గోధుమలు మినహా ఇతర ఆహారధాన్యాలు, నూనె గింజలు, ముడి పత్తి, బొగ్గు, సిమెంట్, కాగితం ఉత్పత్తుల్లో నిజాం రాజ్యం మిగులు స్థాయిలో ఉంది. మరోవైపు పెట్రోల్, కిరోసిన్, లూబ్రికెంట్లు, ఉప్పు, పరిశ్రమలకు సంబంధించిన విడిభాగాలు (స్పేర్ పార్ట్స్) విషయంలో మాత్రం భారత ప్రాంతాలు లేదా ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడి ఉంది. నిజాం రాజ్యానికి నలువైపులా భారత భూభాగం సరిహద్దులుగా ఉండటం, సముద్ర మార్గం లేకపోవడంతో ఆకాశమార్గంలో ఆయుధాలను తెచ్చేందుకు బ్రిటీష్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసిన సిడ్నీ కాటన్ అనే మాజీ సైనికాధికారితో నిజాం ప్రతినిధులకు ఒప్పందం కుదిరింది.
భారత గగనతలం నుంచి సిడ్నీ కాటన్ తన విమానంలో పలుమార్లు హైదరాబాద్ రాజ్యానికి వివిధ సరుకుల మాటున ఆయుధాలను తరలించారని అప్పటి నిజాం రాజ్య ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీ తన ఆత్మకథ ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ లో ప్రస్తావించారు.తిరుగు ప్రయాణానికి అవసరమైన ఇంధనాన్ని కూడా సిడ్నీ కాటన్ అదే విమానంలో తెచ్చుకునే వారని ఆయన తెలిపారు. నిజాం భూభాగాన్ని భారత యూనియన్‌లో కలిపే లక్ష్యంతో భారత్ ఆపరేషన్ పోలో పేరుతో సైనికచర్యను ప్రారంభించింది.
ఆపరేషన్ పోలో సమయంలో మామునూరు ఎయిర్ ఫీల్డ్ పై బాంబు దాడి జరిగిందని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమాండర్‌గా పని చేసిన నల్ల నరసింహులు ఆత్మకథ ‘తెలంగాణ సాయుధ పోరాటం-నా అనుభవాలు’ పుస్తకంలో రాశారు. మాకు ఏ వార్తా పత్రికలు కూడా సరిగా దొరకలేదు. సంస్థానంలో భారత సైన్యం జొచ్చుకురావటం వార్త రెండు రోజులకు తెలిసింది. మా దళాలు మామునూరుకు సమీప గ్రామం నందనంలో ఉన్నాయి. యుద్ధవిమానాలు మామునూరిలోని నైజాం సైన్య స్థావరం, విమానాశ్రయం మీద 2, 3 బాంబులు పడవేశాయి. దగ్గరిలోని మేము బాంబు దాడులను గమనించి చెట్ల కింద దాక్కున్నాం. బాంబులు పడవేసి విమానాల వెళ్ళిపోయాయి, అని నల్ల నరసింహులు రాశారు.
చుట్టూ కందకాల కంచె
నిజాం రాజ్యానికి చెందిన వరంగల్, బీదర్, రాయ్‌చూర్, ఆదిలాబాద్, ఔరంగాబాద్ వైమానిక ప్రాంతాలు భారత వైమానిక దాడులతో దద్దరిల్లాయని, కొన్ని ఎయిర్ ఫీల్డ్‌లను భారత సైన్యం ఆక్రమించకుండా జేసీబీలతో రన్ వే చుట్టూ కందకాలు తవ్వామని, విమానాలు దిగకుండా భారీ వస్తువులను రన్ వే పై పెట్టామని మీర్ లాయక్ తన ఆత్మకథలో పేర్కొన్నారు. భారత సైన్యం తన స్వాధీనంలోకి వచ్చిన ఎయిర్ ఫీల్డ్‌లలో అవసరమైన మరమ్మతులు చేపట్టి నిఘా, సరఫరాలు, కమ్యునికేషన్ వంటి సైనిక అవసరాల కోసం ఉపయోగించింది. బీదర్ ఎయిర్ పోర్ట్‌లో బాంబుదాడులతో దెబ్బతిన్న రన్ వే పునరుద్దరణ పనులకోసం అక్కడి జైలులోని ఖైదీలను భారత సైన్యం వినియోగించింది. ఆపరేషన్ పోలో కొనసాగుతున్న సమయంలో పాకిస్తాన్, పోర్చుగల్ దేశాలు నిజాంకు వాయు, నౌకా దళ సహాయం అందిస్తాయన్న వార్తల నేపథ్యంలో భారత వైమానిక దళ విమానాలు అప్పటికింకా పోర్చుగల్ స్వాధీనంలోనే ఉన్న గోవా వరకు రెక్కీ కొనసాగించాయి.