తూర్పు తీరంలో నూతన నౌకా స్థావరం
రాంబిల్లిలో అర్ధమాన్ రెడీ
యుద్ధ నౌకల మకాం కూడా ఇక్కడే
వచ్చే ఏడాది జల ప్రవేశానికి సన్నాహాలు
ఆంధ్రా కిరీటంలో మరో కలికితురాయి
670 హెక్టార్లలో ఐఎన్ఎస్ వర్ష అంకురార్పణ
అణు జలాంతర్గాములు, యుద్ధనౌకలకు ఆశ్రయం
ఇక్కడ 12 సబ్‌మెరైన్ల విడిదికి అవకాశాలు
టన్నెల్స్, బంకర్లు.. ఈ హార్బర్ స్పెషల్
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ స్మార్ట్ – బంగ్లాదేశ్ చికెన్ నెక్ సమీపంలో వైమానిక స్థావరాన్ని ఏర్పాటుచేసుకుని నకరాలు పోతున్న డ్రాగన్‌ను చిత్తు చేసేందుకు భారత్ సర్వ సన్నద్ధమవుతోంది. భారతదేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భ అణు జలాంతర్గామి కోటను నిర్మించనుంది. తూర్పు నౌకాదళ కేంద్రం విశాఖపట్టణానికి దక్షిణంగా సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని రాంబిల్లి గ్రామం అంతర్జాతీయ యుద్ధ నౌకస్థావరంగా అవతరిస్తోంది. ఇక్కడ భారత అణు జలాంతర్గాములు, యుద్దనౌకలకు ఓ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇక పశ్చిమ తీరంలో కర్నాటకలోని కార్వార్ నౌకా స్థావరం విస్తరణ పనులు కూడా స్పీడందుకున్నాయి. సముద్ర రక్షణ వలయ సామర్థ్యాన్ని పెంచే దిశలో మరో అడుగు ఊపందుకుంది. తూర్పు తీరంలో రక్షణ అవసరాల కోసం నిర్మిస్తున్న నేవీ ప్రత్యామ్నాయ స్థావరం ఐఎన్‌ఎస్ వర్షను 2026లో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది పూర్తిగా వ్యూహాత్మక స్థావరం.
ప్రత్యామ్నాయ నేవీ స్తావరం..
అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి సముద్ర తీరాన్ని ఆనుకొని నేవీ ప్రత్యామ్నాయ స్థావరం నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 670 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించింది. ఇక.. ఏపీ ప్రభుత్వం కూడా భూసేకరణలో సహరించింది. ఈప్రాజెక్టు తొలి దశ 2022 నాటికి, మలి దశ నిర్మాణం 2025 నాటికి పూర్తి కావాల్సి ఉంది. అయితే.. కొవిడ్ కారణంగా ఆలస్యమైంది. ప్రస్తుతం తొలి దశ నిర్మాణం పూర్తి కావొచ్చింది. అచ్యుతాపురంలో బాబా అటమిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) నుంచి ఐఎన్‌ఎస్ వర్షకు సంపూర్ణ సహకారం అందుతోంది. అచ్యుతాపురంలో ఈ అటామిక్ రిసెర్చ్ సెంటర్‌కు 2,200 ఎకరాలు కేటాయించారు.
రిపేర్లు, నిర్వహణ అంతా ఇక్కడే..
రాంబిల్లి స్థావరంలో అణు జలాంతర్గాముల నిర్మాణమే కాకుండా.. మరమ్మతులు, నిర్వహణ వంటి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఈ కేంద్రంలో బంకర్లు, సొరంగ వ్యవస్థలు, ఇన్నర్, ఔటర్ హార్బర్ వంటి సౌకర్యాలున్నాయి. హైసెక్యూరిటీతో ఏర్పాటు చేస్తున్న ఈ వ్యూహాత్మక స్థావరం బంగాళాఖాతం, హిందూమహాసముద్ర ప్రాంతంలోని జలాల్లో నిఘాను పెంచనుంది. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా చర్యలను పసిగట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
సబ్ మెరైన్ హబ్‌గా రాంబిల్లి..
శత్రువుల కంట పడని రీతిలో యుద్ధనౌక స్థావరాలను ఇప్పటి వరకూ రష్యా, చైనా మాత్రమే నిర్మించుకున్నాయి. ఆ కోవలోనే భారత్ కూడా రాంబిల్లి (ఐఎన్ఎస్ వర్ష)ను వ్యూహాత్మక స్థావరంగా ఎంచుకుంది. చైనాకు దీటైన సమాధానం చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇది భారత నౌకాదళానికి సబ్‌మెరైన్ల హబ్‌గా ఉంటుంది. ఇక్కడ 12 సబ్‌మెరైన్లను లంగరు వేసుకోవచ్చు. అందులో అణు జలాంతర్గాములకే అధిక ప్రాధాన్యం. హైనాన్ ద్వీపంలో చైనా అణు జలాంతర్గామి స్థావరం తరహాలోనే.. రాంబిల్లిలో సముద్రం నీటి లోతు ఎక్కువగా ఉంటుంది. దీంతో జలాంతర్గాములు ఉపగ్రహాల కంటపడే అవకాశాలు ఉండవు. సునాయశంగా నీటిలోకి చేరుకుంటాయి. బయటకు వెళ్లగలవు. వీటిని ఉపగ్రహాలు గానీ, నిఘా విమానాలు గానీ కనిపెట్టే చాన్స్ ఉండదు. సముద్రంలో టన్నెళ్ల గుండా సబ్‌మెరైన్లు హబ్‌కు చేరుకునేలా ఈ నిర్మాణం చేశారు. దీనికి పదేళ్లకుపైగా పట్టింది. 2014 ఆగస్టులో ఇక్కడ స్థావరాన్ని నిర్మిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి.
అరిహంత్.. అరిఘాత్ దూకుడు..
విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో 2004 నుంచి న్యూక్లియర్ సబ్‌మెరైన్ల నిర్మాణం జరుగుతోంది. స్ట్రాటజిక్ స్ట్రయిక్ న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ (ఎస్‌ఎ్‌సబీఎన్) పేరుతో నాలుగు న్యూక్లియర్ సబ్‌మెరైన్ల నిర్మాణానికి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెసల్ (ఏటీవీ) ప్రాజెక్టును 2004లో ప్రారంభించారు. ఇందులో మొదటిది అరిహంత్ . దీని నిర్మాణానికి రష్యా సహకారం తీసుకున్నారు. 2009లో జల ప్రవేశం చేశారు. అనేక ట్రయల్స్ అనంతరం 2016 ఆగస్టులో నేవీకి అప్పగించారు. ఇక రెండోది ఐఎన్‌ఎస్ అరిఘాత్. 2017లో ట్రయల్స్ వేశారు. 2024 ఆగస్టు 29న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. వీటిని అరిహంత్ క్లాస్ అణు జలాంతర్గాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో మిగిలిన రెండు సబ్‌మెరైన్ల నిర్మాణానికి ₹40 వేల కోట్లు ఇవ్వనున్నట్టు ఆరు నెలల కిందట కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
అదే బాటలో అర్ధమాన్ ..
సబ్ మెరైన్ ప్రాజెక్టులో నిర్మిస్తున్న మూడో న్యూక్లియర్ సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ అర్థమాన్. ఇది గతేడాది (2024) అక్టోబరులోనే సీ ట్రయల్స్‌కు వెళ్లింది. దీన్ని త్వరలో కమిషనింగ్ చేసి నేవీకి అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఎన్‌ఎస్ అరిహంత్, ఐఎన్‌ఎస్ అరిఘాత్ కంటే అర్థమాన్ పెద్దది. 7వేల టన్నుల సామర్థ్యం కలిగిన ఈ సబ్‌మెరైన్.. 3,500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. మరిన్ని కే -4 క్షిపణులను మోసుకెళ్తుంది. దీని తర్వాత నిర్మిస్తున్న న్యూక్లియర్ సబ్‌మెరైన్‌ను ప్రాజెక్ట్ ఎస్ -4 గా వ్యవహరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇది కూడా నిర్మాణం పూర్తి చేసుకొని సీ ట్రయల్స్‌లో ఉంది.
పశ్చిమలో కార్వార్.. తూర్పులో వర్ష
ప్రాజెక్ట్ సీబర్డ్‌లో భాగంగా కర్నాటకలోని కార్వార్ స్థావరం పశ్చిమ తీరాన్ని కాపాడుతోంది. ఇదే తరహాలో రాంబిల్లిలో ప్రాజెక్ట్ వర్ష తూర్పు తీరానికి రక్షణగా పహారా కాస్తుంది. కార్వార్ నౌకాదళ స్థావరంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల పలు ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభించారు. తాజా పరిణామాలతో ఈ స్థావరంలో 32 నౌకలు, సబ్‌మెరైన్‌లతోపాటు మరికొన్ని నౌకలు అందుబాటులోకి రానున్నాయి. హైనన్ దీవిలో చైనా అణు జలాంతర్గాముల స్థావరం మాదిరిగా రాంబిల్లి నౌకా స్థావరం కూడా ఉపగ్రహాలకు దొరకదు. లోతైన జలాల్లో సబ్ మెరైన్ల రాకపోకలకు ఇది అనువైన ప్రాంతం. గుట్టుగా ఖండాంతర క్షిపణులను మోసుకెళ్లడానికి న్యూక్లియర్ సబ్మెరైన్లకు ఇది తప్పనిసరి. ఇప్పటికే ఇన్నర్ హార్బర్ సిద్ధమైంది. ఔటర్ హార్బర్ పనులు శరవేగంగా సాగుతున్నట్టు సమాచారం. ఏడు వేల టన్నుల అరిహంత్ క్లాస్ అణు జలాంతర్గామి (ఎస్ఎస్బీఎన్- షిప్, సబ్ మెర్సిబుల్, బాలిస్టిక్, న్యూక్లియర్) ఐఎన్ఎస్ అర్దమాన్ ఈ ఏడాది జలప్రవేశం చేయనుంది.