బూడిదలోతుల్లో కనిపించిన మన చరిత్ర
ఆదిమానవుడి ఆనవాళ్లకు ఆధారం ఇదే
ఆంధ్రాలోని జ్వాలాపురంలో దొరికిన పనిముట్లు
ఆఫ్రికాలో లభించినవాటితో దగ్గరి పోలికలు
సుమ్రతా దీవుల్లోని టోబా అగ్నిపర్వతం పేలుడు
భూ మండలం అంతా వెదజల్లిన లావా
అప్పుడే మానవ మనుగడ అంతరించిందనే సాక్ష్యాలు
సూర్యకాంతికి ఆటంకంగా మారిన బూడిద
ఆ తర్వాత మంచుయుగపు ఆనవాళ్లు
అంతకుముందే ఆంధ్రాలో సంచరించిన ఆదిమమానవుడు
74 వేల ఏళ్ల చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిన జ్వాలాపురం
బళ్లారి మ్యూజియంలో భద్రంగా నాటి పనిముట్లు
జీవనోపాధి కోసం బూడిద తరలిస్తున్న స్థానికులు
తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న బడా కంపెనీలు
పరిరక్షణ చర్యలు తీసుకోవాలంటున్న పరిశోధకులు
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : ఏపీలో ఆదిమానవుడు నడయాడిన అద్భుత ప్రదేశం ఇది. ఈ మనిషి భారత్‌లో ఎప్పుడు అడుగుపెట్టాడనే చరిత్రకు కీలక సాక్ష్యం. ఖండాలు దాటిన ఆదిమానవుడి మజిలీకి సజీవ సాక్ష్యం. ఇది నంద్యాల జిల్లా జ్వాలపురం గ్రామంలోని బూడిద మూటల్లో భద్రంగా ఉంది. జ్వాలపురం మార్కెట్టులో ఇదే బూడిద వెయ్యి రూపాయలకే దొరుకుతోంది. బూడిద మూటల్లో మానవ చరిత్ర సాక్ష్యం ఏంటి, టన్నుల లెక్కన అమ్మడం ఏంటి ఆశ్యర్యపోతున్నారు కదా.. ఇప్పుడు అక్కడ జరుగుతున్నది అదే వాస్తవం.. ఒకప్పటి కర్నూలు, ఇప్పటి నంద్యాల జిల్లాలో చారిత్రాత్మక ప్రాంతాలు బేతంచర్ల, యాగంటి సమీపంలో జ్వాలాపురం అనే ఊరు ఉంది. ఆ ఊరిలో ఓ అరుదైన బూడిద దొరుకుతోంది.
ఆ బూడిద ఎక్కడిది? ఇక్కడికి ఎలా వచ్చింది?
భూగర్భ శాస్త్రవేత్తల సమాచారం మేరకు సుమారు 74 వేల ఏళ్ల కిందట ప్రస్తుత ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో టోబా అనే అగ్నిపర్వతం పేలింది. పదేళ్లపాటు భూమిపై ఈ పేలుడు ప్రభావం చూపింది. ఆ విస్పోటనం వెదజల్లిన లావా భూమండలాన్ని కప్పేసింది. ఇది బూడిద పొరలా కమ్మేసి సూర్యకాంతికి అడ్డుకట్టగా మారింది, ఇంకేముందీ సూర్యరశ్మి దూరమై మంచుయుగం పరిస్థితి ఏర్పడింది. ఆ దెబ్బకు మానవ జాతి దాదాపు అంతరించే ప్రమాదంలో పడింది. కేవలం అతికొద్ది శాతం మంది మనుషులు మాత్రమే ఆ ఉపద్రవం నుంచి బతికి బయటపడ్డారు. ఈ లావా భారత్‌లోనూ కొన్ని ప్రాంతాలను కబళించింది. అప్పటి లావా బూడిదకు ఇప్పటి జ్వాలపురం ప్రత్యక్ష సాక్ష్యంగా మారింది.
ఇచ్చోటనే.. ఆదిమానవుడి ఆనవాళ్లు
జ్వాలాపురంలోని లావా బూడిదను పురావస్తు శాస్త్రవేత్త రవి కొరిశెట్టార్ గుర్తించారు. తవ్వకాలు జరిపారు. ఆ బూడిద పొరపైనా, కిందా కూడా ఆదిమానవుడు వాడిన రాతి పనిముట్ల ఆనవాళ్లు కనిపించాయి. ఇది గమనించిన శాస్త్రవేత్తలు ఆశ్చర్య పోయారు. ఎందుకంటే దాదాపు 60వేల ఏళ్ల కిందట ఆదిమానవుడు ఆఫ్రికా నుంచి భారత్ వచ్చాడనేది శాస్త్రవేత్తల అంచనా. కానీ, ఈ అంచనాలను జ్వాలాపురం సవాల్ చేసింది. శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు 60వేల ఏళ్లు కాదు.. 74 వేల ఏళ్ల కిందటే ఆదిమానవుడు ఆంధ్రాలో సంచరించాడని కొత్త ప్రతిపాదను జ్వాలాపురం వెలుగులోకి తీసుకువచ్చింది. ఒక రకంగా దేశ రాతి యుగ చరిత్ర దిశ, గతినే జ్వాలాపురం మార్చేసింది.
ఇక్కడి బూడిద స్పెషల్ గురూ..
జ్వాలాపురంలో పురావస్తు తవ్వకాలతో భారత చరిత్రకు రెండు ప్రధాన ఆధారాలు లభించాయి. ఒకటి… పాలీ లిథిక్ ఆవాసాలకు భారత్‌లో సరైన క్రమం లేదు. కానీ, ఈ బూడిద ఆ లోటు తీర్చింది. 74 వేల ఏళ్ల ముందు, తర్వాత అనే మార్కును అందించింది. రెండు… 60 వేల ఏళ్లు కాదు, 74 వేల ఏళ్ల కిందటే ఆదిమానవులు భారత్ వచ్చారు, ఇక్కడ ఉన్నారని తేల్చింది. ఇక.. టోబా అగ్నిపర్వతం పేలుడు మొత్తం మానవజాతిని తుడిచేయలేదు. ఆ పేలుడు ముందు, తర్వాత కూడా మిడిల్ పాలీ లిథిక్ యుగం కొనసాగింది.
ఆఫ్రికాలో పనిముట్లకు, వీటికి పోలికలు..
ఆఫ్రికాలో దొరికిన పనిముట్లకు, జ్వాలాపురంలో దొరికిన పరికరాలకు చాలా దగ్గరి పోలికలున్నాయి. కాబట్టి మనుషులు 90 వేల ఏళ్ల కిందటే ఇక్కడకు వచ్చి ఉండొచ్చు. మైక్రో లిథిక్ పీరియడ్ పనిముట్లతో మనిషి ఆఫ్రికా నుంచి బయటకు వచ్చాడన్న సిద్ధాంతం కూడా తప్పు కావచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. ఇక.. ఆధునిక మానవుడి గమనాన్ని, భారత్‌లో పూర్వ రాతియుగ చరిత్రను తిరగరాసే అద్భుతమైన సాక్ష్యంగా ఈ జ్వాలాపురం నిలిచింది. కానీ, ఇదంతా గతం కాబోతోంది. ఎందుకంటే ఆ బూడిద వెనుక ఉన్న వేలాది ఏళ్ల మనిషి చరిత్ర కనుమరుగు కాబోతోంది.
డిజెర్జెంట్ కంపెనీలకు తరలుతున్న బూడిద
ఇప్పటికి దాదాపు దాదాపు 90 శాతం బూడిద మాయమై పోయింది. ఈ బూడిద దందా ఇంకా కొనసాగుతోంది. ఈ చారిత్రాత్మక పురాతత్వ ప్రాంతంపై బుల్డోజర్లు స్వైర విహారం చేస్తున్నాయి. అందులో బూడిదను తీసి, ఆ బూడిదలోని చెట్ల అవశేషాలు, మనుషుల ఆయుధాలను జల్లెడతో వేరు చేసి, మెత్తని బూడిదను మూటల్లో ఎత్తి అమ్మేస్తున్నారు. బూడిదను డిటర్జెంట్ పౌడర్, గిన్నెలు తోమే పౌడర్లను తయారు చేసే కంపెనీలు కారు చౌకగా కొనుగోలు చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఏ సంస్థ ఈ బూడిదను కొనుగోలు చేస్తోంది? దేనికి వినియోగిస్తోందో? ఈ విషయం మాత్రం అడక్కూడదు.
వెలుగులోకి జ్వాలాపురం..
సంస్కృతంలో జ్వాల అంటే అగ్ని. దీంతో అగ్ని పర్వత బూడిద ఉన్న ఈ గ్రామం కాబట్టి జ్వాలాపురం పేరు వచ్చిందన్న కథనాన్ని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు. జోలా అంటే జొన్నలు అనే అర్థంలో ఊరి పేరు ఉండేదని, క్రమంగా అదే జ్వాలగా మారిందని కొందరి కథనం. ఈ గ్రామం దగ్గరలోని కొండల్లోని రాతి గుహల్లో ఆదిమానవుడు వేసిన బొమ్మలు కూడా ఉన్నాయి. వాటినే పెయింటెడ్ రాక్ షెల్టర్స్ అంటారు. ఈ గ్రామం దగ్గరే కాక, యాగంటి పరిసరాల్లో గుహలు, బిల్లసర్గం గుహల్లో జంతువుల ఆనవాళ్లు.. ఇవన్నీ కలిపి ప్రపంచ మానవాళి చరిత్రలో కీలకమైన ఘట్టాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
జీవ పరిణామ సిద్ధాంతానికి ఆనవాళ్లు
యాగంటి, బేతంచర్ల, బిల్లసర్గం చుట్టుపక్కల వందల సంఖ్యలో పెయింటెడ్ రాక్ షెల్టర్లు కనిపించేవి. యాగంటి చుట్టుపక్కల అలాంటి గుహలు ఎన్నో ఉన్నాయి. జీవ పరిణామ సిద్ధాంతానికి ఉమ్మడి కర్నూలు జిల్లా బిల్లసర్గం గుహలు చాలా కీలకమైనవి. భారతీయ పురావస్తు చరిత్ర పితామహుడు రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ తొలిసారి ఈ గుహల గురించి వివరించారు. తిరిగి మళ్లీ ఆ గుహల్లో మనిషి జాడ కనుగొనడం కోసం ఆర్కియాలజిస్ట్ రవి కొరిశెట్టార్ బృందం గాలిస్తున్న తరుణంలో జ్వాలాపురం వెలుగులోకి వచ్చింది. 2004-05 కాలం నుంచి రెండేళ్ల పాటు జ్వాలాపురంలో రవి కొరిశెట్టార్ తవ్వకాలు జరిపారు. అక్కడ తవ్వుతున్న ప్రాంతంలో తెల్లటి బూడిద కనిపించింది. అది అగ్నిపర్వతపు బూడిద అని అర్థమైంది.
బళ్లారి మ్యూజియంలో భద్రంగా..
అది అగ్నిపర్వత బూడిద గ్రామస్తులకు తెలీదు. ఈ బూడిదను డిటర్జెంట్ పరిశ్రమలకు ఎగుమతి చేస్తున్నారని అప్పుడే తెలిసింది. జ్వాలాపురం తవ్వకంలో ఒక మిడిల్ పాలీ లిథిక్ రాయి దొరికింది. దానికి దగ్గరలో ఎర్లీ పాలీ లిథిక్ రాయి దొరికింది. ఇక జుర్రేరు నది ఒడ్డున మైక్రో లిథిక్ వస్తువులు దొరికాయి. యాగంటి పెయింటెడ్ రాక్ షెల్టర్ల దగ్గరలో నేలపై మైక్రో లిథిక్ పరికరాలు కనిపించాయి. మొత్తం మీద ఆ చుట్టుపక్కల దాదాపు 2 వేల ఎకరాల పరిధిలో పాలీ లిథిక్ నుంచి మెగా లిథిక్ వరకూ చాలా మానవ ఆవాస సాక్ష్యాలు దొరికాయి. తూర్పు ఆఫ్రికాతో సమానమైన సాక్ష్యాలు దొరికాయి. ప్రస్తుతం జ్వాలాపురం తవ్వకాల్లో బయటపడిన వస్తువులన్నీ కర్ణాటకలో భద్రపరిచారు. రాతి పనిముట్లు, ఇతర ముఖ్యమైన అవశేషాలను కర్ణాటకలోని బళ్లారిలోని రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ సంగనకల్లు మ్యూజియంలో భద్రపరిచారు .