సెంట్రల్ డెస్క్ , ఆంధ్రప్రభ :1600సవంత్సరం.. డిసెంబర్ 31వ తేదీన భారతావనిలో ఈస్ట్ ఇండియా కంపెనీ తన పాలన ప్రారంభించింది. తొలి బ్రిటీష్ ఎలిజిబెత్ రాణి నుంచి రాయల్ చార్టర్ యోగాన్ని పొందారు. ఆ తర్వాత 19వ శతాబ్ధంలో బ్రిటీషర్లను తరిమికొట్టే నినాదంతో భారతీయులు ఏకమయ్యారు. మనల్ని విభజించటానికి కులమే ప్రధాన అస్త్తంగా బ్రిటీష్ దొరలు భావించారు. 1931లో కులగణన చేశారు. భారతావనిని కులాల పేరిట విభజించారు. నిమ్నజాతుల పేరిట ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు గట్టారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణనతో పాటు కులగణన జరపాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక.. క్విట్ ఇండియా ఉద్యమానికి ఏడాది ముందు 1941లో కులగణన జరిగినప్పటికీ ఆ వివరాలు బయటకు వెల్లడించలేదు. స్వాతంత్య్రం వచ్చిన 78 ఏళ్ల తర్వాత తొలిసారి కులాల లెక్కలు తేల్చేందుకు ఇప్పుడు మరోసారి అడుగులు పడుతున్నాయి. అప్పుడెందుకు బయటపెట్టలేదంటే..దేశంలో చివరిసారిగా 2011లో జనాభా లెక్కలు సేకరించారు. ఈ జనగణనలో సామాజిక ఆర్థిక కుల గణన నిర్వహించారు. 2016లో ఈ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచారు. కానీ, కులాల లెక్కల వివరాలను అందులో పెట్టలేదు. 2011లో సేకరించిన సామాజిక, ఆర్థిక కులగణన (సోషియో ఎకనమిక్ కాస్ట్ సెన్సస్ – ఎస్‌ఈసీసీ)లో భాగంగా సమాచారాన్ని బయటపెట్టలేమని 2022 జులైలో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
సుప్రీంకోర్టులో ఈ విషయంపై విచారణ సమయంలో 2021లో కేంద్రం స్పందించింది. 2011లో చేపట్టిన సామాజిక-ఆర్థిక కులగణనలో చాలా లోపాలున్నాయి. తప్పులు దొర్లడంతోపాటు ఆ సమాచారం దేనికీ ఉపయోగపడదని కేంద్రం చెప్పింది. 1931 జనాభా లెక్కల్లో కులాలసంఖ్య 4,147గా ఉండేది. కానీ, 2011 జనాభా లెక్కల్లో ఈ సంఖ్య 46 లక్షలకుపైనే ఉన్నట్లు కనిపిస్తున్నాయని కేంద్రం తెలిపింది. కులగణనపై ఎందుకు వ్యతిరేకత 1980లలో పరిస్థితులు మారాయి.
కులాల ఆధారంగా పుట్టుకొచ్చిన కొన్ని ప్రాంతీయ పార్టీలు.. కొన్ని రాష్ట్రాల్లో చక్రాలు తిప్పడం మొదలుపెట్టాయి. మరో వైపు రాజకీయాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకత ఎదురుకావడం మొదలైంది. దిగువ కులాలకు విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని ఉద్యమాలు మొదలయ్యాయి. ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీ)లకు రిజర్వేషన్లు ఇవ్వాలని 1979లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇచ్చే అంశాలను పరిశీలించేందుకు భారత ప్రభుత్వం మండల్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. 2010లో ఈ కుల గణను చేపట్టాలని చాలా మంది ఎంపీలు కోరడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అంగీకరించింది. అప్పట్లో సేకరించిన కులాల సమాచారాన్ని ప్రభుత్వం బయటపెట్టలేదు.
కులగణన ఎవరికి లాభం
మండల్ కమిషన్ అంచనా ప్రకారం దేశంలో బీసీలు 52శాతం ఉంటే బీసీలకు 27శాతం రిజర్వేషన్ ఉంది. ఇక ఓసీల జనాభా చాలా తక్కువ ఉన్నప్పటికీ ఏ సర్వే లేకుండానే నేరుగా ఎస్టీల కంటే ఆర్థికంగా వెనకబడిన వర్గాల కింద10 శాతం రిజర్వేషన్ అమలవుతోందనే విమర్శలున్నాయి. ఏ కులం.. జనం ఏ ప్రాంతంలో ఏ ఆర్థిక స్థితిలో ఉన్నారో తెలిస్తే అప్పుడు దానికి తగ్గట్టు రిజర్వేషన్ల అంశంతో పాటూ సంక్షేమ పథకాల అమల్లోనూ మార్పు ఉంటుందన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బీహార్ కులగణనతో మొదలు..
దేశంలో అసలు ఏ కులంజనం ఎంత మంది ఉన్నారు? అందులో సంపన్నులు ఎందరు, పేదలు ఎంతమందో తేల్చాలని ప్రతిపక్షాలు కోరితే .. ఈ అంశాలు అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దేశంలో మొదటిసారి బ్రిటిష్ కాలంలో 1931లో కులగణన జరిగింది. జనాభాలో ఏ కులం ఎందరు ఉన్నారనేది అప్పుడే పక్కాగా తేలింది. ఆ లెక్క ప్రస్తుత పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ను కలుపుకుని ఉంటుంది. కానీ, ఆ తర్వాత ఏ ప్రభుత్వమూ కులాల వారీగా జనాభాను లెక్కపెట్టలేదు.
బీహార్ ప్రభుత్వం తాజా కులజనగణన ప్రకారం రాష్ట్ర జనాభా 13కోట్లు. ఇందులో ఇతర వెనుకబడిన కులాల జనం (ఓబీసీలు) 27.12 శాతం, అత్యంత వెనుకబడిన వర్గాలు (ఈబీసీలు) 36.01 శాతం, షెడ్యూల్డ్ కులాలు 19.65 శాతం, షెడ్యూల్డ్ తెగలు 1.68 శాతం ఉన్నారు. జనాభాలో అగ్రవర్ణాల సంఖ్య 15.52 శాతంగా ఉంది.
ఓబీసీలు 27.12 శాతం, ఈబీసీలు 36.01 శాతం కలుపుకొని బీసీలు 63.13 శాతం మంది ఉన్నారు.
ఏపీ, తెలంగాణలో పరిస్థితి ఏంటి?
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన జరిపింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పేరుతో కార్యక్రమం నిర్వహించింది. కుల సర్వే పూర్తి కాగానే.. అసలు లొల్లి తెరమీదకు వచ్చింది. ముఖ్యంగా 2014కంటే బీసీల సంఖ్య బాగా తగ్గడంతో బీసీ సంఘాలు, పార్టీల్లోని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ సర్వేకు పట్టుబట్టారు.
ఇక.. ఏపీలోనూ కులసర్వేకు ప్రయత్నాలు జరిగాయి. కానీ కార్యరూపం దాల్చలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేపట్టాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కులసర్వే చేస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించినా కుదరలేదు. అంతకుముందు రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ హయాంలో ఇంటింటి సర్వే జరిగింది. ప్రతీ కుటుంబ సభ్యుల వివరాలు అధికారికంగానే సేకరించారు. అందులో కులాలు, మతాల వివరాలు కూడా ఉన్నాయి. ఆ లెక్కలను అధికారికంగా వెల్లడించలేదు.
బీసీల ఒత్తిళ్లకు తలవంచిన కేంద్రం..
దేశంలో బీసీలు, ఇతర కులాల సంఖ్య నిర్దుష్టంగా తెలియకపోవడంతో కులగణన చేయాలనే డిమాండ్ చాలాకాలంగా బీసీ సంఘాల నుంచి వస్తోంది. కులగణనతో రిజర్వేషన్ల డిమాండ్ పెరుగుతుందన్నది పలువురి అభిప్రాయం. 1990లో మండల్ కమిషన్ రాజకీయాలను వ్యతిరేకించిన బీజేపీ.. అప్పటి నుంచి అదే వాదనకు కట్టుబడి ఉంది. కులగణన సామాజిక ఐక్యతను దెబ్బతీస్తుందని బీజేపీ నేతలు ఆరోపించారు. షెడ్యూల్ కులాలు, తెగలు తప్ప.. మిగిలిన కులాలను లెక్కించడం తమ విధానం కాదని 2021 జులై 20న అప్పటి హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ పార్లమెంటులో ప్రకటించారు.
కానీ. అనూహ్యంగా ఇప్పుడు కులగణనకు మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ సర్వే ఫలితాలను కేంద్రం ప్రకటిస్తుందా?.. లేదా అన్నది సర్వే తర్వత కానీ స్పష్టత రానుందని పరిశీలకలు అంటున్నారు.