మేయర్‌కు పొంచి ఉన్న అవిశ్వాస గండం
తెరమీదకు పోటాపోటీగా పార్టీల క్యాంపులు
మలేషియాలో టీడీపీ నేతల ఎంజాయ్‌మెంట్
శ్రీలంకలో సేదతీరుతున్న వైసీపీ లీడర్లు
19న సమావేశం కానున్న స్పెషల్ కౌన్సిల్
సస్పెన్స్‌ను రేకెత్తించిన మేయర్ పీఠం
మిస్టరీ వీడేది అప్పుడే అంటున్న పరిశీలకులు
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ రాజకీయాలు ట్విస్టుల మీద ట్విస్టులతో అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. పోటాపోటీ శిబిరాల్లో టీడీపీ, వైసీపీ నేతలున్నారు. గంట గంటకూ మారుతున్న నిర్ణయాలతో ప్రత్యర్థి శిబిరాల్లో అలజడి మొదలవుతోంది. ఈ క్యాంపులు దేశం విడిచి వెళ్లిపోయాయి. ఈ నెల 19వ తేదీ వరకూ క్యాంపులన్నీ సర్వసుఖ సౌఖ్యాలతో సందడి చేస్తుంటే.. మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాస పరీక్ష చుట్టూ ఉత్కంఠత రెట్టింపైంది.
అంతా మ్యాజిక్..
గ్రేటర్ మేయర్ పీఠంపై కన్నేసిన టీడీపీ నో కాన్ఫిడెన్స్ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 19వ తేదీన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఎక్స్ ఆఫీషియోతో కలిపి మ్యాజిక్ ఫిగర్ 74 కాగా.. గ్రేటర్‌లో బలాబలాలపై ఇటు కూటమి, అటు వైసీపీ ఎవరికి వారే లెక్కలు కడుతున్నారు. బీజేపీ, జనసేనతో కలిసి తమ బలం 61కి పెరిగిందని.. మేయర్ పదవి తమదేనని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నెంబర్ గేమ్ ను వైసీపీ పట్టించుకోవడం లేదు. కూటమి మాత్రం ఎక్స్ ఆఫీషియోతో కలిపి తమ సంఖ్యా బలం 73గా లెక్కేసుకుంది. అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాయి.
కట్టుతప్పకుండా యత్నాలు..
ఈ నేపథ్యంలో ముందుగానే వైసీపీ తమ కార్పొరేటర్లను బెంగళూరు తరలించింది. ఇక సమయం దగ్గర పడుతున్న తరుణంలో అనూహ్యంగా శిబిరాన్ని శ్రీలంకకు మార్చేసింది. అందరూ కాకపోయినా వీరిలో కీలక కార్పొరేటర్లను అదీ టీడీపీ ఎరకు మక్కువ చూపిస్తున్నారనే భయంతో కొందరిని శ్రీలంకకు తరలించటం అనివార్యంగా భావించినట్టు తెలిసింది. అదే సమయంలో వైసీపీలో గెలిచి ఇటీవల కూటమిలో చేరిన కార్పొరేటర్లతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రస్తుత లెక్క ప్రకారం కూటమికి ఇద్దరు సభ్యులు అవసరం ఉంది. వైసీపీ పూర్తి స్థాయి వ్యూహం పన్ని అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
విశాఖ పీఠంపైనే టీడీపీ గురి..
విశాఖ మేయర్ పదవే లక్ష్యంగా టీడీపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. 2021లో అధికారంలో ఉన్న అప్పటి వైసీపీ 59మంది కార్పొరేటర్లతో మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. మేయర్ పదవిని యాదవ (బీసీ) సామాజికవర్గానికి చెందిన గొలగాని హరివెంకట కుమారికి కట్టబెట్టారు. అప్పట్నుంచి ఎలాంటి ఢోకా లేకుండా ఆమె ఆ పదవిలో కొనసాగుతున్నారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకు సొంత బలం లేకపోయినా, అదనపు కలవటంతో స్థానిక సంస్థల్లో పాగా వేసేందుకు టీడీపీ పావులు కదుపుతూ వస్తోంది. అలా కొన్ని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో తమ కూటమిని అందలమెక్కించింది. ఈ పరంపరలో ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్దదైన విశాఖ నగర పాలక సంస్థ కూడా చేరింది. తాజాగా విశాఖ పీఠాన్ని అధిష్టించమే కూటమి టార్గెట్.
మలుపులే మలుపులు..
నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కూటమి నేతలు ఉవ్విళ్లూరారు. అవిశ్వాసంతో మేయర్ హరి వెంకట కుమారిని గద్దె దించాలని ప్లాన్ వేశారు. నిబంధనల ప్రకారం నాలుగేళ్లు పూర్తయ్యే వరకు అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి వీల్లేదని తెలియడంతో వెనక్కి తగ్గారు. అయినప్పటికీ తెర వెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అధికారం కోల్పోవడంతో డీలాపడ్డ వైసీపీ కార్పొరేటర్లను తమ దారిలోకి తెచ్చుకున్నారు. కూటమి నేతల ఆఫర్లకు కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు మెత్త పడ్డారు. ఇలా 17 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. అప్పటిదాకా వైసీపీకి మద్దతు పలికిన ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా టీడీపీకే జై కొట్టారు. దీంతో కేవలం 29 మంది కార్పొరేటర్లకే పరిమితమైన టీడీపీ సంఖ్యా బలం 48కి పెరిగింది. మరో ఏడుగురు వైసీపీ కార్పొరేటర్లు, ఒక ఇండిపెండెంటు కార్పొరేటరు జనసేన, మరో కార్పొరేటర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన నుంచి మొదట్లో ముగ్గురు ఎన్నికయ్యారు. బీజేపీ, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కక్కరు చొప్పున గెలిచారు. దీంతో వైసీపీ నుంచి గోడ దూకినోళ్లతో కలిపి జీవీఎంసీ కౌన్సిల్ లో కూటమి బలం 61కి ఎగబాకింది. వైసీపీ బలం 34కి పడిపోయింది.
కూటమికి పెద్ద టాస్కే కానీ…
సంఖ్యాబలం పెంచుకోవటం కూటమికి పెద్ద టాస్కే. కొన్నిరోజులుగా భీమిలిలో నడుస్తున్న క్యాంప్ ను మలేషియాకు తరలించింది. తొలి ప్రయత్నంలో 26 మంది విదేశాలకు వెళ్లారు. మేయర్ పై అవిశ్వాసం ప్రకటించిన కూటమి.. ఇప్పుడు డిప్యూటీ మేయర్ కు నోటీసులు ఇచ్చింది. డిప్యూటీ మేయర్ శ్రీధర్ ను తప్పించాలని భావిస్తుండగా.. జనసేన ఓటు కీలకంగా మారింది. విశాఖ నగరంలో మొత్తం 98 కార్పోరేటర్ స్థానాలు ఉన్నాయి. వంశీ కృష్ణ ఎమ్మెల్యేగా గెలవటంతో ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున 29 మంది కార్పోరేటర్లుగా గెలిచారు.
ఇతరుల మద్దతుతో..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. జనసేనకు ముగ్గురు కార్పోరేటర్లు ఉండగా..వైసీపీ, స్వతంత్ర కార్పోరేటర్లు ఏడుగురు జనసేనలో చేరారు. బీజేపీ నుంచి ఒకరు కార్పోరేటర్‌గా గెలవగా.. వైసీపీ నుంచి ఒకరు చేరారు. మరో తొమ్మిది మంది టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. వీరితో పాటు విశాఖపట్నం, అనకాపల్లి అసెంబ్లీ సెగ్మంట్లలో కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కలుపుకుని 109 ఓట్లకుగాను, కూటమి బలం 73 కు చేరింది. సీపీఐ కార్పొరేటర్ స్టాలిన్, ముత్తంశెట్టి కుమార్తె ప్రియాంక కూడా కూటమికే మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఏతావాతా విశాఖ మేయర్ పీఠాన్ని వైసీపీ కోల్పోతుందని టీడీపీ గంపెడాశతో ఉన్న మాట వాస్తవం.