Exclusive | భీమ్స్‌‌‌-007 … ఆకాశంలో గూఢచారి

శత్రు కదలికలపై నిరంత‌ర నిఘా
నింగిలోకి నిఘా శాటిలైట్లు
100 నుంచి 150 దాకా ప్ర‌యోగించే చాన్స్‌
₹27వేల కోట్ల బడ్జెట్​ కేటాయించిన భారత్​
సరిహద్దు రక్షణ, తీరంలో నిఘా సామర్థ్యం పెంపు
సరికొత్త ప్రణాళికలను రచిస్తున్న రక్షణశాఖ
అందులో భాగమే ఇస్రో స్పేడెక్స్​ మిషన్​
21 ఉపగ్రహాలను తీసుకురానున్న ఇస్రో
మిగతావాటి కోసం ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం
ఫ్రాన్స్​ సహకారంతో మరికొన్న తయారు
ఉపగ్రహాల్లో ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​
చైనా, పాక్​ ఎత్తులను తిప్పికొట్టే యత్నాలు
రక్షణ వ్యవస్థలో కీలకం కానున్న స్పై రాకెట్లు

సెంట్రల్​ డెస్క్​, ఆంధ్రప్రభ:

పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్​ కుయుక్తులను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు భారత్​ సరికొత్త ఎత్తుగడులను వేస్తోంది. దీనికోసం అంతరిక్ష నిఘా తీవ్రతను గుర్తించింది. ఇందులో భాగంగా గూఢచార శాటిలైట్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు వెగవంతం చేసింది. దీనికి 27వేల కోట్లను కేటాయించినట్టు రక్షణ రంగ వర్గాలు తెలిపాయి. కాగా, భారతదేశం తన సరిహద్దు రక్షణ, తీర ప్రాంత నిఘా సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి రాబోయే మూడేండ్ల‌లో 100 నుంచి 150 కొత్త ఉపగ్రహాలను ప్రయోగించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రకటనను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ వెల్ల‌డించారు. ఏప్రిల్ 23వ తేదీన చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఈ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం భారతదేశం 55 ఉపగ్రహాలను నిర్వహిస్తోంది. అయితే, 15 వేల కి.మీ. సరిహద్దు, 7 వేల 500 కి.మీ. తీర ప్రాంతాన్ని కవర్ చేస్తూ సమర్థవంతంగా నిఘా నిర్వహించడానికి ఈ సంఖ్య సరిపోదని నారాయణన్ పేర్కొన్నారు.

సరిహద్దు రక్షణకు చాలా ఉపగ్రహాలు అవసరం

భారత అంతరిక్ష శాఖ కార్యదర్శి నారాయణన్ ఆధ్వర్యంలో కొత్తగా చేప‌ట్ట‌బోయే ఉప‌గ్ర‌హాల‌ను పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. ప్రధాని మోదీ కూడా అంతరిక్ష రంగంలో సంస్కరణలను ప్రవేశపెడుతున్నారు. రాకెట్లు, ఉపగ్రహాలను నిర్మించడంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. భారతదేశ సరిహద్దుల్ని రక్షించుకోవడానికి చాలా ఉపగ్రహాలు అవసరంగా కనిపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం భారత నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇస్రో SpaDeX మిషన్లలో భాగంగా..

క‌శ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. దేశ రక్షణ కోసం ఇస్రో నిఘా ఉప‌గ్ర‌హం వంటి చర్యలు చేపట్టడం కీలకంగా మారింది. ఇక, భారత అంతరిక్ష సంస్థ చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు ఇటీవల విజయాలను అందుకున్నాయి. ఇస్రో SpaDeX మిషన్లలో భాగంగా ఉపగ్రహాల రెండో డాకింగ్‌ను కూడా విజయవంతంగా నిర్వహించింది. ప్రపంచంలోనే దీన్ని సాధించిన నాలుగు దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది.

చొర‌బాట్లు, ఉగ్ర క‌ద‌లిక‌ల‌పై నిఘా..

అయితే, ఇప్పుడు చేపట్టబోయే మరో 150 ఉపగ్రహాలు దేశ సరిహద్దు, తీరప్రాంత రక్షణలో రియల్-టైమ్ నిఘాను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఉగ్రవాద చొరబాటు, సైనిక కదలికలు, రాడార్ స్థానాలు, నౌకా కదలికలపై నిఘా ఉంచడానికి ఇవి సహాయపడతాయి. ఈ ప్రాజెక్ట్ క‌శ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి వంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని మరింత భద్రతను కల్పించడానికి రూపొందించబడినట్లు తెలుస్తోంది.

ఉపగ్రహాల్లో ఏఐ ఆధారిత విశేషాలు..

కొత్తగా చేప‌ట్ట‌బోయే ఉపగ్రహాల్లో కృత్రిమ మేథ‌స్సు (ఏఐ) ఆధారిత విశ్లేషణలు, సింథటిక్ అపెర్చర్ రాడార్, అధిక రిజల్యూషన్ ఎలక్ట్రో-ఆప్టికల్ సెన్సార్లు, అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఇమేజింగ్ సామర్థ్యాలు వంటి టెక్నాలజీని ఇంక్లూడ్ చేయ‌నున్నారు. ఇవి శత్రు సైనికుల‌ కదలికలు, క్షిపణి మోహరింపులు, మొబైల్ లాంచర్లను ట్రాక్ చేయడంలో సహాయపడతాయి. ఇక.. లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, జియోస్టేషనరీ ఆర్బిట్‌లలో ఈ ఉపగ్రహాలు మోహరించే ఆలోచన చేస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్‌కు 27 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌

భార‌త్ నిఘా వ్య‌వ‌స్థ‌లో ఈ ఉప‌గ్ర‌హాలు సమగ్రమైన కవరేజ్‌ అందిస్తాయ‌ని భావిస్తున్నారు. ఈ 150 ఉపగ్రహాల్లో భాగంగా, SBS-III ప్రాజెక్ట్ కింద 52 గూఢచార ఉపగ్రహాలను కూడా ప్రయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు 27 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించారు. కాగా, ఇది 2027-28 నుండి ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది.

21 ఉపగ్రహాలను తయారు చేస్తున్న ఇస్రో

ఇందులో భాగంగా.. ఇస్రో, మొదటి 21 ఉపగ్రహాలను తయారు చేసి ప్రయోగించనుంది. మిగిలిన 31ఉపగ్రహాలను దక్షిణ భారతదేశంలోని మూడు ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేస్తాయి. ఫ్రాన్స్ దేశం సహకారంతో కొన్ని ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇందులో ప్రైవేట్ సహకారం కూడా లేకపోలేదు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన అంతరిక్ష రంగ సంస్కరణల భాగంగా.. రాకెట్లు, ఉపగ్రహాల తయారీలో ప్రైవేట్ సంస్థలు భాగస్వామ్యం కావడానికి అవకాశం వచ్చింది. ఇస్రో ఈ సంస్థలకు సాంకేతికంగా మార్గనిర్ధేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం, భారతదేశం.. GSAT-7 రుక్మిణి, GSAT-7A యాంగ్రీ బర్డ్, కార్టోశాట్ సిరీస్, రిసాట్ సిరీస్, ఎమిసాట్, మైక్రోసాట్-ఆర్, హైసిస్, IRNSS నావిక్ వంటి ఉపగ్రహాలను సరిహద్దు రక్షణ కోసం ఉపయోగిస్తోంది. ఈ ఉపగ్రహాలు సమాచార సేకరణ, నావిగేషన్, సురక్షిత మెసేజ్ వ్యవస్థలను అందిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *