ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు

ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు

  • దర్యాప్తు ముమ్మురం
  • జిల్లా వ్యాప్తంగా ఉలిక్కిపడిన బెల్ట్ షాపులు
  • ఇంచార్జ్ సస్పెన్షన్తో టిడిపి కీలక నేతలను పసుపు కోటలో భయం భయం

  • అన్నమయ్య బ్యూరో, మొలకలచెరువు (ఆంధ్రప్రభ): కూటమి ప్రభుత్వంలో తాజాగా అన్నమయ్య జిల్లా మొలకల చెరువులోనూ, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం లోను వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ కేంద్రాల మంట ఇంకా ఆరలేదు. ఇప్పటికే ఆ మంటల కారణంగా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ జయ చంద్రారెడ్డి పై సస్పెన్షన్ వేటు పడింది. అధికారుల దర్యాప్తులో భాగంగా సంబంధిత ఎక్సైజ్ సీఐ హిమబిందుపై కూడా వేటు వేశారు. ఒక్కసారిగా దర్యాప్తులోకి దిగిన అధికారులు లోతులను వెతుకుతున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మద్యం పాలసీకి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నా.. ఇందులో అధికార పార్టీ నాయకుల పాత్ర లేకుండా ఉంటుందా? అన్నది సర్వత్రా చర్చగా మారింది. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో అధికారంలో ఉన్న కొందరు నాయకులు ఇసుక వ్యాపారాలలో అక్రమంగా కోట్ల రూపాయల సంపాదిస్తున్న సంగతి రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్టు సమాచారం. అధికార పార్టీకి చెందిన నాయకులు పరిస్థితులు తమను దాటిపోవులే అన్న అతి నమ్మకంతో ఆదాయ వనరులను పెంచుకునే పనులు ప్రారంభించినట్టు విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎవరికీ అనుమానం రాకుండా మొలకలచెరువులోని ఓ మద్యం గోడౌన్ లోనే అక్రమ మద్యం తయారీ కేంద్రాన్ని ప్రారంభించి వందల కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్టు విమర్శలు ఉన్నాయి. అక్కడ తయారైన మద్యాన్ని నిఘా అధికారుల కళ్ళుగప్పి అన్నమయ్య జిల్లాలోనే కాకుండా అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కూడా సరఫరా చేసినట్టు సమాచారం. అన్నమయ్య జిల్లాలో ప్రతి మండలానికి 200కు తగ్గకుండా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని విమర్శలు గుప్పుమంటున్న నేపథ్యంలో జిల్లా మొత్తం 15 వేలకు పైగా ఉన్న బెల్టు షాపులే ఆదాయ వనరుగా ఎంచుకున్న అక్రమ మద్యం వ్యాపారులు గుట్టు చప్పుడు కాకుండా అతి చౌకగా లభించే మద్యం బ్రాండ్ ను నకిలీ బాటిళ్లు తయారు చేసి పల్లెలకు ముమ్మురంగా సరఫరా చేసినట్టు విమర్శలు ఉన్నాయి. అసలేదో నకిలీ ఏదో గుర్తుపట్టలేని గ్రామీణ ప్రాంతంలోని బెల్టు షాపులు యజమానులు తమకు చౌకగా వచ్చిన మద్యాన్ని ఎడాపెడా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు.
    ఒక్కసారిగా రెండు రోజుల క్రితం మొలకలచెరువులో బయటపడిన నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టు రట్టు కావడంతో జిల్లాలో వేలాదిగా ఉన్న బెల్టు షాపులు ఉలిక్కిపడ్డాయి.

ఎక్సైజ్ సీఐ వేటు

ములకలచెరువులో ఇటీవల నకిలీ మద్యం తయారీ పావరాన్ని గుట్టు రట్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు పది మందిని అరెస్టు చేసి నలుగురి కోసం గాలిస్తున్న సంగతి తెలిసిందే.. పరారీలో ఉన్న ఒకరైన కట్ట రాజును ఇబ్రహీంపట్నంలో అదుపులోకి తీసుకొని ములకలచెరువు ఎక్సైజ్ స్టేషన్కు తీసుకువచ్చి విచారిస్తున్నట్లు సమాచారం. అత్యంత వేగంగా లోతుగా జరుగుతున్న దర్యాప్తులో నకిలీ మద్యం తయారీలో అరెస్ట్ అయిన వారితో పాటు మరికొంతమందిని కేసులో చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని మిగిలిన నిందితుల కోసం ఎక్సైజ్ సిబ్బంది గ్రూపులుగా విడిపోయి గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నకిలీ మద్యం తయారీని గుర్తించడంలో అలసత్వం కారణంగా ములకలచెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు వేశారు . హిమబిందును విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. హిమబిందు స్థానంలో లక్కిరెడ్డిపల్లె ఎక్సైజ్ సీఐ కిషోర్ను నియమించారు.

టిడిపి ఇన్చార్జ్ సస్పెన్షన్తో ఆ పార్టీ కీలక నేతల్లో వణుకు

రాష్ట్రంలో సంచలనం రేపుతున్న నకిలీ మద్యం తయారీ రాకెట్ గుట్టురట్టై.. దర్యాప్తు ముమ్మరం కావడంతో అటు రాజకీయంగాను ఇటు అధికారులలోను వికెట్ల పైన వికెట్లు పడిపోతున్నాయి. రెండు రోజుల క్రితం తంబళ్లపల్లె టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ జయ చంద్రారెడ్డి పై సస్పెన్షన్ వేటు వేయగా.. మంగళవారం ఎక్సైజ్ సీఐపై బదిలీ వేటు వేశారు. ఈ దర్యాప్తు ఏరకంగా మలుపు తిరిగి ఎవరెవరి మెడలకు చుట్టుకుంటుందోనని టిడిపిలోని కొందరు కీలక నేతలు వణికిపోతున్నారు. ఈ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని రుదువు చేసుకోవడానికి కొందరు నానా తండాలు పడుతున్నారు. కేసులో ఉన్న నిందితుల ద్వారా పలు రకాల ప్రకటనలు గుప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటన ఆ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ జయచంద్ర రెడ్డి కి మెడకు బలంగా చుట్టుకునే అవకాశాలు లేకపోలేదని పలువురు అంటున్నారు. ఈ కేసులో ఏ వన్ నిందితుడు జనార్ధన రావుకు జయచంద్రారెడ్డికి బలమైన సంబంధాలు ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుతో వారిరువురూ ఉన్న ఫోటోలే సాక్షాభూతాలుగా నిలుస్తున్నాయని పలువురు అంటున్నారు. లిక్కర్ వ్యాపారంలో అపార అనుభవం ఉన్న జయచంద్రారెడ్డికి ఆయన స్నేహితులు బంధువులు గా చెప్పుకునే కొందరు మొలకలచెరువు ఇబ్రహీంపట్నం లలో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ కుంభకోణంలో నిందితువులుగా ఉండడం జయచంద్రారెడ్డికి శాపంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ నకిలీ మద్యం తయారీ రాకెట్ కు కూటమి ప్రభుత్వంలో సహకరించిన కీలక నేతల మెడకు చుట్టుకోకుండా వదలే ప్రసక్తే లేదని పలువురు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన మద్యం పాలసీని తుంగలో తొక్కిన ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నట్టు సమాచారం.
మొలకల చెరువులో తయారైన నకిలీ మద్యం అన్నమయ్య జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలోను గ్రామీణ ప్రాంతాలకు చేరినట్టు విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా రాయచోటికి చుట్టుపక్కల గల మండలాలలో మొలకలచెరువులో తయారైన అక్రమ మద్యం బాటిళ్లు బెల్టు షాపుల్లో బెల్టు షాపుల్లోఅధికారులకు లభించినట్టు విశ్వసనీయ సమాచారం. దీనిని బట్టి పరిశీలిస్తే వందల కోట్ల రూపాయలు వ్యాపారం నకిలీ మద్యం ద్వారా సాగించి సొమ్ము చేసుకున్న వారితో పాటు వారికి సహకరించిన అధికార పార్టీలోని కొందరు కీలక నేతల పైన కూడా దర్యాప్తు జరిగే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ బర్నింగ్ సమస్య కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై దృష్టి సారించి దీని వెనక సూత్రధారులు పాత్రధారులు ఎవరో తెలుసుకొని వారిపై కూడా వేటు వేయడానికి సంసిద్ధులవుతున్నట్లు తెలుస్తోంది. రోజు రోజుకు మలుపు తిరుగుతున్న నకిలీ మద్యం తయారీ కేసు వలలో ఇంకా ఎన్ని చేపలు చిక్కుతాయో.. చిక్కిన వాటిలో వలలను తెంచుకొని ఎన్ని బయటపడతాయో వేచి చూడాల్సి ఉంది.

Leave a Reply