వాస్తవ పరిస్థితులకు భిన్నంగా రాష్ట్ర బడ్జెట్

వాస్తవ పరిస్థితులకు భిన్నంగా రాష్ట్ర బడ్జెట్
రాజీవ్ యువవికాసం పేరుతో ఉద్యోగు లను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ
నర్సంపేట, ఆంధ్రప్రభ ; వరంగల్ జిల్లాలోని వాస్తవ పరిస్థితులకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ చిత్తశుద్ధిలేని పచ్చి అబద్దాల కూర్పుగా ఉందన్నారు. దిగజారుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్నారు.రాజీవ్ యువవికాసం పేరుతో రాష్ట్ర నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విచారణ వ్యక్తం చేశారు.
లోప భూయిష్టమైన చిత్తశుద్ధి లేని బడ్జెట్ కేటాయించి ప్రజలను మోసం చేసిందని సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని బడ్జెట్లో ప్రస్తావిస్తున్నారు తప్ప అమలు చేయడం లేదని,వ్యవసాయ కూలీలకు ఒక్క రూపాయి బడ్జెట్ ద్వారా ఇవ్వడం లేదన్నారు.గత రెండు బడ్జెట్లలో ప్రవేశపెట్టిన అంశాలనే మళ్లీ ప్రస్తావించారు తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని,ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులైన దేవాదులకు నిధులు ఈ బడ్జెట్ లో ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్టుకు 400 కోట్లు కేటాయించి డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని జిల్లా పర్యటనలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు.వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం లేని బడ్జెట్ గా అభివర్ణించారు.
రైతులను, వ్యవసాయ కూలీలను, కార్మికులను ఈ బడ్జెట్లో మోసం చేశారు. సన్న వడ్లకు బోనస్ ప్రస్తావన అసలే లేదన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధినీ ఈ బడ్జెట్ నిరాశపరిచిం దనీ,ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహీస్తున్న ఎమ్మెల్యేలు ,మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ బడ్జెట్ పైన ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.
