- ఎంతో ప్రతిష్టాత్మకంగా శృంగేరి పీఠాధిపతి పర్యటన
- అన్ని పక్షాలను కలుపుకొని ముందుకు వెళతాం..
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, (ఆంధ్రప్రభ) : రాజన్న ఆలయ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతి స్వామి వారి ధర్మ విజయ యాత్రలో భాగంగా ఈ నెల 19, 20 తేదీలలో వేములవాడకు విచ్చేయుచున్న సందర్భంగా స్వామి వారికి ఘనంగా స్వాగతం పలకడానికి తగిన ఏర్పాట్లపై వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం ఆవరణలోని ఓపెన్ స్లాబ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ… ఆలయ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా లోక కల్యాణార్థం అన్ని వర్గాలను, అన్ని పక్షాలను కలుపుకొని వెళ్లాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు.
శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి జగద్గురువుల పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ‘న భూతో న భవిష్యతి’ అనేలా స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్వాగత ఏర్పాట్లు ఉండాలన్నారు.
ఆకాశమే హద్దుగా ఎవరికి నచ్చిన రీతిలో ఆధ్యాత్మిక చింతనతో ఏర్పాట్లు చేయాలన్నారు. వేములవాడ పట్టణంతో పాటు పరిసర మండల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
19, 20వ తేదీల్లో జగద్గురువుల రాక కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వేములవాడ పట్టణంలోని కుల సంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక వేత్తలు, మహిళా సంఘాలతో చర్చించామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి ఫలితంగా రూ. 150 కోట్లతో ఆలయ నిర్మాణం చేపడుతున్నామన్నారు.
100 ఏళ్లకు సరిపడేలా ఏర్పాట్లు చేసేందుకు ఆలయ నిర్మాణం ఉంటుందన్నారు. బ్రాహ్మణోత్తముల కోరిక మేరకు శంకర మఠంలో స్వామివారి అభిషేక కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ క్రమంలో శృంగేరి పీఠాధిపతి వేములవాడ రాక, వారి సూచనలు ఎంతో విలువైనవన్నారు.
పీఠాధిపతికి స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. 19వ తేదీన సాయంత్రం 6 గంటలలోపు వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్దకు అందరూ చేరుకుని ‘నభూతో న భవిష్యతి’ అనే రీతిలో స్వామివారికి స్వాగతం పలకాలన్నారు.
ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

