- వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
- త్రాగునీటి సమస్య, ఎల్ఆర్ఎస్ పై పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష
- తమ విధులను అశ్రద్ధచేస్తే చర్యలు తప్పవు
(యాదాద్రి భువనగిరి), ఆంధ్రప్రభ / చౌటుప్పల్ : వేసవికాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ఠమైన నివారణ చర్యలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు తెలిపారు. చౌటుప్పల్ మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శులతో మంచినీటి సరఫరా, ఎల్ఆర్ఎస్ పై సమీక్షా నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బోర్‌వెల్స్, హ్యాండ్‌పంప్‌లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. మంచినీటి ట్యాంకుల పరిస్థితి, లీకేజీలపై పరిశీలన చేసి ట్యాంకుల మరమ్మతులు, క్లీనింగ్ పనులు చేయించాలని, విధులను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. మండలంలోని గ్రామాల వారీగా మంచినీటి సరఫరాపై పంచాయతీ కార్యదర్శులను అరా తీశారు.
రానున్న వేసవికాలంలో మంచి నీటి సమస్య తలెత్తకుండా ఇప్పటినుండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో ఉన్న మిషన్ భగీరథ నీరు, బోర్లాలో ఉన్న నీరు సరిపోకపోతే స్థానికంగా ఉన్న బోర్లను కూడా తీసుకొని మంచినీటి సమస్యను పరిష్కరించాలన్నారు.
మంచినీటి సమస్య ఉన్నది దగ్గర అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. వర్షాకాలంలో వర్షం నీరు వృధా పోకుండా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ను అందరూ ఉపయోగించుకునేలా గ్రామంలో కార్యదర్శిలు ప్రోత్సహించాలన్నారు.
గ్రామాలలో కార్యదర్శిలే ప్రధానమని, గ్రామాలలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కార్యదర్శులు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో మంచినీటి సమస్య, చెత్త, డ్రైనేజీలు, నర్సరీలు, విద్యుత్తు తదితర అన్ని సమస్యలను కార్యదర్శులు ఎప్పటికప్పుడు సమీక్ష చేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
త్రాగునీటి సమస్యపై జిల్లా కేంద్రంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు ఇతర సిబ్బంది ఇప్పటివరకు ఏ విధంగా పనిచేసినప్పటికీ ఇప్పటినుండి కచ్చితంగా పనిచేయాలని, గ్రామాల్లో అన్ని వార్డులలో తిరిగి సమస్యలను తెలుసుకోవాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
మంచిగా పని చేసినవారికి ప్రజలలో గుర్తింపు ఉంటుందన్నారు. తన బాధ్యతలను ఎవరు విస్మరించిన చూస్తూ ఊరుకోమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవో, మండల స్థాయిలో తహసిల్దార్లు తరచుగా రివ్యూలు కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో ఆర్డిఓ శేఖర్ రెడ్డి, డీఈ దీన్ దయాల్, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపిడిఓ సందీప్ కుమార్, ఏఈవో ముత్యాల నాగరాజు, ఎంపీవో అంజిరెడ్డి, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.