(కర్నూలు, ఆంధ్రప్రభ ) : అతడు మధ్యతరగతి నిరుద్యోగి. కష్టపడి రాత్రింబవళ్లు చదివాడు. మెగా డీఎస్సీలో సత్తా చాటాడు. మంచి ర్యాంకు సాధించాడు. టీచర్ ఉద్యోగం (Teacher job) ఖాయమే. రెండు రోజుల్లో ఇంటర్వ్యూ ఉద్యోగంలో చేరటమే ఆలస్యం. ఇంటిల్లిపాది ఆనందానికి అవధులు లేవు. ఇంతలో విధి పగ పట్టింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ (Fire Accident) పడగ విప్పింది. ఇంట్లో దావాలనం రగిలింది. ఇంట్లోనే సర్టిఫికెట్లు అన్నీ కాలిపోయాయి. బూడిద వెక్కిరించింది. సకాలంలో సర్టిఫికెట్లు దాఖలు పర్చకపోతే ఉద్యోగం రాదు. ఆ యువకుడు అల్లాడిపోయాడు. మంత్రి ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నాడు.
తక్షణమే ఆ మంత్రి సైతం చలించిపోయారు. జరిగిన ఘోర ప్రమాదాన్ని విద్యాశాఖ మంత్రి లోకేశ్ (Education Minister Lokesh) బాబుకు మంత్రి వివరించారు. కడకు ఈ నిరుద్యోగ ఉపాధ్యాయుడి కథ సుఖాంతమైంది. అసలు ఏం జరిగిందంటే.. నంద్యాల జిల్లా అవుకు మండలం చెర్లోపల్లి మధు డీఎస్సీలో 773 ర్యాంకు సాధించారు. రెండు రోజుల ముందే జరిగిన అగ్నిప్రమాదంలో అతని సర్టిఫికెట్లన్నీ కాలిపోయాయి. జిల్లాకు చెందిన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసి తనను ఆదుకోవాలని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ (Verification of certificates) లో జిరాక్స్ కాపీలకు అవకాశం ఇప్పించాలని ప్రాదేయపడ్డాడు. ఈనెల 25న ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ లో 26న ఆంధ్రప్రభ కర్నూలు జిల్లా ఎడిషన్ లో ఈ ఘటన వార్త ప్రచురితమైనది.
ఆంధ్రప్రభ యోధులు ఈ సమస్యపై కదం తొక్కారు. జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్తను షేర్ చేశారు. ఇక శుక్రవారం కర్నూల్ లోని డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ దగ్గరికి వచ్చిన మధును రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి (Prathapa Reddy) గుర్తించారు. దీనంగా ఉన్న మధును పిలిపించారు. జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు, జిల్లా విద్యాశాఖ అధికారి సామ్యూల్ పాల్ తో చర్చించారు. రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు (Vijayarama Raju) తో జేడీ ప్రతాపరెడ్డి ఫోన్ లో మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆంధ్రప్రభలో ప్రచురితమైన వార్త క్లిప్పింగ్ లతో కమిషనర్ కు వివరించారు. ఇక డీఎస్సీలో 773 ర్యాంకు సాధించిన మధు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు జిరాక్స్ కాపీలతో అధికారులు అనుమతించారు. టీచర్ గా బాధ్యతలు చేపట్టనున్న మధు జీవితంలో ఈ వార్త వెలుగులు నింపిందంటూ అవుకు ప్రజలు బంధువులు ఆంధ్రప్రభకు కృతజ్ఞతలు తెలిపారు.