బాబు పాల‌న‌లో బీసీల‌కు స‌మ‌న్యాయం

బాబు పాల‌న‌లో బీసీల‌కు స‌మ‌న్యాయం

కర్నూలు బ్యూరో, అక్టోబర్ 22, ఆంధ్రప్రభ : బీసీల రిజర్వేషన్ల పై మాట్లాడే అర్హ‌త వైసీపీ నాయ‌కుల‌కు లేద‌ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. కర్నూలులో తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు బీసీ సంఘం దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు షణ్ముఖం, ఇతర బీసీ నేతలు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో బీసీలు గళం విప్పి 42 శాతం రిజర్వేషన్లు సాధించారు. అయితే కొందరు రాజకీయ కుట్రలు చేసి ఆ రిజర్వేషన్లు అమల్లోకి రాకుండా అడ్డుకుంటున్నార‌ని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు న్యాయం చేస్తూ రిజర్వేషన్ల‌ను 26 నుంచి 34 శాతానికి పెంచినట్టు గుర్తు చేశారు. వైసీపీ నాయకులు బీసీ రిజర్వేషన్ల పై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడమే కాక, కొన్ని ఇప్పటికే అమలు చేశారు” అని తెలిపారు.

బీసీల అభివృద్ధి కోసం తెలుగుదేశం పుట్టింది: షణ్ముఖం
తెలుగుదేశం పార్టీ అవిర్భావమే బీసీల అభివృద్ధి కోసమ‌ని బీసీ సంఘం దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు షణ్ముఖం తెలిపారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంద‌న్నారు. బీసీల సామాజిక, ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేయడానికి సమగ్ర విధానాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ నేతలు రాంబాబు, సుజాత, కృష్ణాజీరావు, శివన్న, గణేష్, బీసన్న, ఈశ్వరయ్య, రాజశేఖర్, వెంకటేష్ పాల్గొన్నారు.

Leave a Reply