ఎమ్మిగనూరు శాసనసభ్యులు బీ.వీ.జయనాగేశ్వర్ రెడ్డి కితాబు..

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఉల్లిపాయ ధరల పతనంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఉల్లి పంట పండించిన ప్రతి రైతుకు హెక్టారుకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కర్నూలు జిల్లాలోనే ఖరీఫ్ సీజన్‌లో 45,278 ఎకరాల్లో సాగు చేసిన ఉల్లిపాయ పంటకు ఈ ఆర్థిక సాయం ద్వారా 24,218 మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు పేర్కొన్నారు ఎమ్మిగనూరు శాసనసభ్యులు బీ.వీ.జయనాగేశ్వర్ రెడ్డి.

ఎన్నికల ముందు రైతులకు ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పినట్లుగానే, ఇప్పటికే మొదటి విడతలో రూ.7 వేల రూపాయలు జమ చేయడం జరిగిందని, దీని కోసం ప్రభుత్వం రూ. 3,700 కోట్లు ఖర్చు చేసిందని, అంతే కాకుండా ఉల్లి రైతులకు అండగా నిలబడేందుకు కిలో రూ.12 చొప్పున కొనుగోలు ప్రారంభించడం జరిగిందని చెప్పారు జయనాగేశ్వర్ రెడ్డి. ఇది రైతు శ్రమకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం అని ఆయన అన్నారు.

జగన్ రెడ్డి పాలనలో మాత్రం రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 2019 నుంచి 2024 మధ్య అనేకసార్లు ఉల్లిపాయ ధరలు కిలోకు రూ.2, 4 వరకు పడిపోవడంతో రైతులు రోడ్డెక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి మధ్యలో ఉల్లిపాయ ధరలు దాదాపు 40 శాతం వరకు పడిపోయాయి, అయినా ఆ సమయంలో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదన్నారు.

కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మాటల్లో కాదు చేతల్లో చూపిస్తుందనీ, రైతుల శ్రమకు గౌరవం ఇచ్చి, వారికీ న్యాయమైన ధరలు రావడానికి కృషి చేస్తోందని పునరుద్ఘాటించారు. రైతు అన్నదాతను కాపాడడం కూటమి ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply