జన్నారం, ఫిబ్రవరి 19 (ఆంధ్రప్రభ ) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో బుధవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ సుడిగాలి పర్యటన చేశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఉదయం 10:30 గంటలకు అకస్మికంగా జిల్లా పాలనాధికారి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుడు ఎన్.విజయ్ కుమార్, విద్యార్థులతో మాట్లాడి, బోర్డుపై ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయించారు. విద్యార్థుల సామర్థ్యాన్ని ఆయన పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.
ఈసందర్భంగా ఆసుపత్రిలోని వైద్యాధికారిణి జి.ఉమాశ్రీని, జె.లక్ష్మిని ఆస్పత్రిలోని ఇతర ఉద్యోగులను, ఆసుపత్రికి వచ్చిన రోగులను పలు ప్రశ్నలు అడిగి స్థితిగతులను తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని కిష్టాపూర్ గ్రామ సమీపాన ఉన్న కేజీబీవీ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా కేజీబీవీ ప్రత్యేక అధికారిణి ఎం.శ్రీవాణి, విద్యార్థులతో ముచ్చటించి, డైనింగ్ హాల్ ను పరిశీలించి, వంట పని వారితో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి అధికారుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
