Electricity Bill | ప్రజల పై భారం తగ్గించాలనే..

Electricity Bill | ప్రజల పై భారం తగ్గించాలనే..

Electricity Bill | విజ‌యవాడ‌, ఆంధ్రప్రభ : సీఎం చంద్ర‌బాబు నాయుడు విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌తో వైసీపీ ప్ర‌భుత్వం మోపిన విధ్యుత్ చార్జీల అద‌న‌పు భారం నుంచి ప్ర‌జ‌ల‌కు ఊర‌ట ల‌భించింద‌ని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షురాలు గ‌ద్దె అనురాధ అన్నారు. నగరంలోని గురునానక్ కాలనీలో ఉన్న ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్‌గా ముందుకు సాగుతున్నాయని అన్నారు. మేనిఫెస్టోలో పేర్కొనకపోయినా, ప్రజల పై భారం తగ్గించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు విద్యుత్ చార్జీలను తగ్గించి గొప్ప నిర్ణయం తీసుకున్నారని ఆమె కొనియాడారు. 2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టే నాటికి ఆంధ్రప్రదేశ్‌ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలిపిన ఘనత చంద్రబాబుదేనని గుర్తు చేశారు.

అయితే.. వైఎస్ జగన్ తన అవివేకపూరిత నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని పూర్తిగా అప్పులపాలు చేశారని విమర్శించారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని హామీలు ఇచ్చిన జగన్, ఐదేళ్ల పాలనలో ఐదు సార్లు విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజల పై సుమారు రూ.32 వేల కోట్ల భారం మోపారని గద్దె అనురాధ ఆరోపించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యమైన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సమగ్ర సంస్కరణలు చేపడుతోందని తెలిపారు. గత ప్రభుత్వం మిగిల్చిన వేల కోట్ల రూపాయల ట్రూ అప్ భారాన్ని ప్రజల పై మోపకుండా, కూటమి ప్రభుత్వం పూర్తిగా భరించిందని స్పష్టం చేశారు. తొలిసారిగా ట్రూ డౌన్ ఛార్జీలు నమోదు కావడం సీఎం చంద్రబాబు తీసుకుంటున్న విద్యుత్ సంస్కరణల ఫలితమని పేర్కొన్నారు. ట్రూ డౌన్ అమలుతో యూనిట్‌కు 13 పైసలు విద్యుత్ చార్జీలు తగ్గించగలిగామని తెలిపారు.

జగన్ పాలనలో అక్వా రైతుల పై యూనిట్‌కు రూ.3.50 భారంగా మోపితే, కూటమి ప్రభుత్వం యూనిట్‌కు రూ.1.50 తగ్గిస్తూ రైతులకు పెద్ద ఊరట కల్పించిందని చెప్పారు. రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తూ ప్రజల పై భారం తగ్గిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం యూనిట్ విద్యుత్‌ను రూ.5.19లకు కొనుగోలు చేస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రూ.4.70లకే కొనుగోలు చేస్తోందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఇంకా విద్యుత్ చార్జీలు తగ్గించే అవకాశం ఉందని గద్దె అనురాధ తెలిపారు.

Leave a Reply