మూడో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి మూడవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పలువురు విద్యుత్ కార్మిక నాయకులు మాట్లాడుతూ యాజమాన్యం నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఆర్టిజన్ కార్మికుల గైర్హాజరీ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది.

విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో పాటు, నిర్వహణ, సేవలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిపై విద్యుత్ వినియోగదారులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే స్పందించాలని కోరారు.

ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే స్పందించి ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను స్వీకరించి, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే విద్యుత్ ఆర్టిజన్‌ల జీవితాల్లో కూడా అదే వెలుగులు నింపాలని కోరారు. సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర జేఏసీ తరఫున 1104 రాష్ట్ర నాయకులు కృష్ణ మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికుల ఏపీఎస్పీ రూల్స్ వర్తించే వరకు సమ్మె విరమించేది లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్మికురాలు కృష్ణవేణి, అనిత, డివిజన్ చైర్మన్ విజయకుమార్, కన్వీనర్ పవన్ బాల శంకర్ తో పాటు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply