దళిత మహిళా మున్సిపల్ వైస్ చైర్మన్‌కు అవమానం

దళిత మహిళా మున్సిపల్ వైస్ చైర్మన్‌కు అవమానం

  • ప్రోటోకాల్ పాటించరా?
  • వైస్ చైర్మన్‌ను వేదికపైకి పిలవకపోవడం వివక్షే..
  • కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • పరకాల మున్సిపల్ అధికారులపై ఏకు శంకర్ మాదిగ మండిపాటు

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ ఏకు దివ్యకు జరిగిన అవమానంపై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం జరిగిన సభలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధిని వేదికపైకి ఆహ్వానించకుండా, సాధారణ సభ్యుల వరుసలో కూర్చోబెట్టడం మున్సిపల్ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కడమేనని ఆయన మండిపడ్డారు.

ఈ సందర్భంగా శంకర్ మాదిగ మాట్లాడుతూ మున్సిపాలిటీలో రెండో అత్యున్నత పదవిలో ఉన్న వైస్ చైర్మన్‌ను వేదికపైకి పిలవకపోవడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. “చైర్మన్ పక్కన కూర్చోవాల్సిన వైస్ చైర్మన్‌ను కింద కూర్చోబెట్టడం అంటే అది కేవలం ప్రోటోకాల్ ఉల్లంఘన మాత్రమే కాదు, దళిత మహిళా నేత పట్ల ప్రదర్శించిన అహంకారం మరియు వివక్షత” అని ఆయన ధ్వజమెత్తారు. అధికారులు కావాలనే దళిత మహిళా వైస్ చైర్మన్ ను పక్కన పెట్టారా? లేక ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గి ఈ పని చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి? మున్సిపల్ చట్టం ప్రకారం డయాస్ ( వేదిక) మీద చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్‌లకు ఖచ్చితంగా స్థానం కల్పించాలి. కానీ పరకాల మున్సిపాలిటీలో నిబంధనలను గాలికొదిలేసి, ప్రజాప్రతినిధిని అవమానపరిచేలా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. పరకాల ఎమ్మెల్యే కుట్రపూరితంగానే దురాహంకారంతో దళిత మహిళ వైస్ చైర్మన్ అవమానం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మున్సిపల్ కమిషనర్ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి బాధ్యతారాహిత్యం వల్లే ఈ పరాభవం జరిగిందని ఆయన ఆరోపించారు. వెంటనే ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, ప్రోటోకాల్ పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని శంకర్ మాదిగ డిమాండ్ చేశారు. బాధ్యులను సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో పాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దళిత ప్రజాప్రతినిధులకు ఆత్మగౌరవం దక్కే వరకు పోరాటం ఆపబోమని శంకర్ స్పష్టం చేశారు.

Leave a Reply