BJP | ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా… ఏకగ్రీవ నిర్ణయం !
ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్న ఉత్కంఠకు బీజేపీ హైకమాండ్ తెరదించింది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పేరు ఖరారైంది. ఈరోజు (ఫిబ్రవరి 19) రాత్రి బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే కేజ్రీవాల్‌ను మట్టికరిపించిన పర్వేష్ వర్మకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. స్పీకర్ గా విజయేంద్ర గుప్తాను ఎంపిక చేశారు.
దీంతో రేపు (ఫిబ్రవరి 20న) రాంలీలా మైదానంలో రేఖా గుప్తా సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆమెతో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణం చేస్తారు. దిల్లీ అసెంబ్లీ స్పీకర్ గా విజయేంద్ర గుప్తా ప్రమాణం చేస్తారు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నుంచి ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు… లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు.
27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. దీంతో రేపు ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. రేపు మధ్యాహ్నం 12.35 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది.