TRACTOR| గుడివాడ అభివృద్ధికి కృషి

- ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
- స్వచ్ఛ గుడివాడకు రూ.20 లక్షల విలువచేసే చేసే రెండు ట్రాక్టర్లు సమకూర్చిన గౌతమ్ విద్యాసంస్థ
TRACTOR | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ అభివృద్ధికి సంకల్పంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. స్వచ్ఛ గుడివాడ రూపకల్పనకు తీసుకుంటున్న చర్యల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, కూటమి పాలనలో గుడివాడలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. ఐ లవ్ గుడివాడ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య మెరుగుకు గౌతమ్ విద్యాసంస్థల చైర్మన్ కొసరాజు అవినాష్ రూ.20 లక్షల విలువ చేసే రెండు ట్రాక్టర్లను శనివారం పురపాలక సంఘానికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, చేతుల మీదుగా ట్రాక్టర్ల పత్రాలను అవినాష్ ,మున్సిపల్ కమిషనర్ ఎస్.మనోహర్ కు అందించారు. ఎమ్మెల్యే రాము జెండా ఊపి రెండు ట్రాక్టర్లను ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఐ లవ్ గుడివాడ కాన్సెప్ట్ లో భాగంగా స్వచ్ఛ గుడివాడ రూపకల్పనకు తీసుకుంటున్న చర్యలు మెరుగైన ఫలితాలను ఇచ్చాయన్నారు. తాము చేస్తున్న కృషిలో అవినాష్ లాంటి దాతలు భాగస్వామ్యం కావడం సంతోషకరమని, ఇదే స్ఫూర్తితో మరింత మంది దాతలు ముందుకు వచ్చి గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి గుడివాడ పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు 96 ప్రాంతాలు చెత్త డంపింగ్ కేంద్రాలుగా ఉండేవన్నారు. తాము తీసుకున్న చర్యల వల్ల ఆ ప్రాంతాలను ఇప్పుడు సుందరమయంగా మారాయన్నారు. డ్రైనేజీల ఆధునికీకరణ, ఎప్పటికప్పుడు సిల్ట్ తొలగింపు పనులు చేయడం, రోడ్లపై యథేచ్ఛగా పశువులు తిరగడాన్ని నియంత్రించడం వంటి చర్యలతో దోమల సమస్యను అత్యధిక శాతం తగ్గించగలిగామన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తున్నామన్నారు. ఇన్ని మార్పులకు కృషిచేసిన మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే అభినందించారు.
గౌతమ్ విద్యాసంస్థల చైర్మన్ కొసరాజు అవినాష్ మాట్లాడుతూ… గుడివాడ ఎమ్మెల్యే రాము ప్రజలకు మంచి చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటారన్నారు. ఐ లవ్ గుడివాడ కాన్సెప్ట్ కు మద్దతుగా ప్రజలకు మంచి చేయడం కోసం పారిశుధ్య మెరుగుకు అవసరమయ్యే ట్రాక్టర్లను పురపాలక సంఘానికి సమకూర్చినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.మనోహర్, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గౌతమ్ విద్యాసంస్థల చైర్మన్ కొసరాజు అవినాష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ గడ్డ రవి, టీడీపీ మండల అధ్యక్షుడు వాసే మురళి, ఏపీ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, టీడీపీ నాయకులు డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, లింగం ప్రసాద్, పండ్రాజు సాంబయ్య, నిమ్మగడ్డ సత్యసాయి, సయ్యద్ జబీన్, గడ్డం దాస్, మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
