కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ . ఏరువాక సాగాలిరో.. అన్నో చిన్నన్న.. నీ కష్టమంతా తీరునురో అన్నో చిన్నన్న.. ఏ ముహూర్తాన.. సినీ కవి రచయిత కలం నుంచి ఈ పదం.. జాలు వారిందో కానీ ఇది అక్షరాల నిజం..
ఏరువాక పౌర్ణమి (Eruvaka ) రైతులకు (Farmers) సంబంధించిన అతిపెద్ద పండగ.(Festival ) దీనినే జ్యేష్ట పౌర్ణమి అంటారు. .వర్షఋతువులో (Monsoon ) జ్యేష్ఠశుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపు కుంటారు. తొలకరి జల్లుల (rains )ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారు.
తొలకరితో…
తొలకరి జల్లులు కురిస్తే చాలు.. రైతన్న మోములో ఎక్కడలేని ఆనందం.. చిగురిస్తుంది.ఇదే సమయంలో గల గల పారే.. సెలయేర్లు..పిల్ల కాలువల గెంతులాట.. పుడమి తల్లి పులకరింతకు చిహ్నమే ఏరువాక పౌర్ణమి. ఆధునికత ఎంత ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. నైరుతి రుతుపవనాల ఆగమనంతో పౌర్ణమి నాటికి తొలకరి జల్లులు కురిసి భూమి మెత్తబడుతుంది. దుక్కి దున్నడం, వ్యవసాయ పనులను ప్రారంభించడం ఏరువాకతోనే మొదలౌతుంది.
నేటి నుంచి మొదలవుతుంది.
అసలు ఏరువాక అంటే*
అన్నదాతలు వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. ప్రతి ఏటా జ్యేష్ట శుద్ధ పూర్ణిమ నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఏరు అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం కావడమని అర్థం. పండుగ రోజు రైతులు కాడెద్దులను కడిగి కొమ్ములకు రంగులు వేసి గజ్జెలు, గంటలతో అలంకరిస్తారు. ఎడ్లకు కట్టే కాడిని ధూపదీప నైవేద్యాలతో పూజించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు. భూమిని దుక్కి దున్నడం ప్రారంభిస్తారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య వ్యవసాయ పనులు మొదలుపెడతారు.
*మహా యజ్ఞంగా భావన*
ఏరువాకను జ్యోతిష్య శాస్త్రవేత్తలు కష్యారంభం, సస్యారంభం అని వ్యవహరిస్తారు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఏరువాక పౌర్ణమినీ జరుపుకుంటారు. జేష్ట మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం దేశమంతా ఒకేలా ఉంటుంది. దేశంలో దాదాపు 80 శాతం వర్షపాతం నైరుతి వల్లే కలుగుతుంది. పాడి పంటలు, పొలం పనులకు ఆటంకాలు ఎదురవ్వొద్దని ఏరువాకను మహా యజ్ఞంలా పరిగణించి ఆచరిస్తారు. నాగేటి సాల్లల్లో సీత దొరికింది కాబట్టి సీతా యజ్ఞంగానూ భావిస్తారు.
.ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 10 లక్షల హెక్టార్ల భూమి ఉండగా, ఇందులో ఒక ఖరీఫ్ లోనే దాదాపు ఆరు లక్షల హెక్టార్లలో ప్రధాన పంటలు పండిస్తారు. ఇందులో ఒక ఖరీఫ్ లోనే నైరుతి రుతుపవనాలు ఆధారంగా 456 మిల్లీ మీటర్ల వర్షపాతంను ఆధారంగా చేసుకుని ఈ పంటలు పండిస్తారు. వాస్తవంగా ఉమ్మడి జిల్లా సగటు వర్షపాతం 680 మి,మీ కావడం విశేషం. వీటి ఆధారంగా వెయ్యి నుంచి మూడు వేల కోట్లు విలువ చేసే పంటలు పండి రైతులు పలువురికి ప ట్టడన్నం పెట్టడంతో పాటు తన కుటుంబంకు ఇంత సమకూర్చుకోవడమే ఏరువాక పౌర్ణమి స్పెషల్.
.*రైతన్న ఇంట అతి ప్రాచీన పండుగ*
ఏరువాక పండుగ అతి ప్రాచీనమైనది. శ్రీకృష్ణ దేవరాయలు ఈరోజున రైతుల కృషిని అభినందించి తగిన రీతిలో వారిని ప్రోత్సహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శుద్దోదన రాజు కపిలవస్తులో లాంఛనంగా ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని రైతులకు అందించినట్లు కథలున్నాయి. ఏరువాకతో వ్యవసాయానికి సిద్ధమయ్యే రైతులకు ధాన్యపు సిరులు కురవాలని ఆశిద్దాం.