దుగ్గిరాల (ఆంధ్రప్రభ)ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పసుపు పంట అమ్మకాల్లో మందకోడి కనిపిస్తుంది.పసుపు పంట ధరలు రోజు రోజుకి తక్కువగా నమోదవుతున్న పరిస్థితి నెలకొంటుంది. రైతు సేవలో ముందుండే దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో పసుపు ధరలు తగ్గుదలగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నాయి.
యార్డ్ కి కొత్త పసుపుపంట వచ్చే సమయంలో గిట్టుబాటు ధరలేక అరకొరగా యార్డులో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనేగాక దేశంలోని పసుపు మార్కెట్ యార్డుల్లో దుగ్గిరాల ప్రత్యేక గుర్తింపు ఉంది.అలాంటి యార్డులోనే ధరలు లేకపోవడం,అమ్మకాలు తగ్గడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి చివరి నాటికీ కొత్త పంట రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పసుపు ధరలు ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి.
ధరల్లో అనిచ్చితి.. అరకొర అమ్మకాలు
పసుపు పంటకి మద్దతు ధర లేక ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైతులకి గత ఏడాదిలో కొంతమేర పసుపు ధరల్లో పెరుగుదల ఊరటనిస్తున్నాయి.పంట పెట్టుబడి రాకుండా నష్టాలతో పంటని సాగుచేస్తున్న పసుపు రైతుకు ధరలు కొంత ఉపశమనమిచ్చాయి అనుకున్న తరుణంలోనే ధరల్లో తగ్గుదల నెలకొంది.గత ఏడాది దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ లో పసుపు ధరలు రూ.10 వేల నమోదుకావడంతో అన్నదాతలు పంటని అమ్ముకున్నారు.
జూన్ నెల నుండి పసుపు ధరలు అంచలంచెలుగా పెరుగుతూ 10,000 నిలకడగా నమోదు అవుతున్నాయి. దీంతో యార్డుకు పసుపు పంట అమ్మకాలు జోరుగసాగాయి.పసుపు ధరలలో పెరుగుదల ఉండటంతో రైతులు తమ పంటను అమ్ముకునేందుకు యార్డుకి అధికం వచ్చారు.గత ఏడాది ఆరంభం నుంచి పసుపు ధరలు కొంచెం కొంచెంగా పెరుగుతూ ఆగస్టు నెలలో 11వేలకు చేరింది. అక్టోబర్ నెలలో నిలకడగా 10వేలకి దగరలో నమోదయ్యాయి.
కొన్నినెలలు ధరలు నిలకడగా కొనసాగినప్పటికీ 2025 ఆరంభం నుండే తగ్గుదలతో ప్రస్తుతం 8వేలు నిలకడగా నమోదు అవుతున్నాయి.అదే విధంగా పసుపు మార్కెట్ యార్డులో పసుపు అమ్మకాలు గత మూడేళ్లతో పోల్చితే గత ఏడాది అధికంగా జరిగడం కొసమెరుపు.గత మూడేళ్లలో పసుపు అమ్మకాలను పరిశీలిస్తే 2021-22 సంవత్సరానికి గాను 55వేల 141 క్వింటాళ్ల పసుపు అమ్మకాలు జరిగాయి.
ఈ ఏడాది పసుపు ధరలు రూ.4500 నుంచి 7వేల వరకు పలికాయి. 2022-23 సంవత్సరానికి గాను 76 వేల209 క్వింటాళ్ల పసుపు అమ్మకాలు జరిగాయి. పసుపు ధరలు రూ. ఐదువేల నుంచి 6వేల వరకు నమోదయ్యాయి. అదేవిధంగా 2023 – 24 సంవత్సరంలో ధరలు 6వేల 8వేల మధ్య ఉండగా, పంట 88047వేల క్వింటాళ్ల వరకు పసుపు అమ్మకాలు జరిగాయి.2024-25 సంవత్సరములో 10వేలతో అమ్మకాలు కొనసాగుతుండగా ప్రస్తుతం షుమారుగా 96వేల క్వింటల్ అమ్మకాలు జరిగాయి.
గత రెండు సంవత్సరాలతో పోలిస్తే 2023,2024లో కంటే అమ్మకాలు ఎక్కువగా జరిగినట్టు అధికారిక లెక్కల ద్వారాతెలుస్తుంది.ధరలు 10వేలు నమోదు కావడం, రైతుకి ఊరటనివ్వడంతో మరింతగా పసుపు అమ్మకాలు జరిగినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ధరలు మళ్ళీ తగ్గడంతో అమ్మకాలు కొంతమేర తగ్గాయి
.*యార్డ్ కి రానున్న కొత్త పంట*
మార్కెట్ యార్డ్ కి మార్చి చివరిలో లేదా ఏప్రియల్ మొదటి వారంలో కొత్త పంట యార్డ్ కి రానుంది. కొత్త పంట వచ్చే సమయంలోనైనా పసుపు ధరలు పెరగాలని అన్నదాత లు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఏడాది వచ్చిన వరదలతో నది పరివాహక లంక గ్రామాల్లో సాగుచేసిన పసుపు పంట పూర్తిగా దెబ్బతినడంతో పసుపు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఈ ఏడాదిలోనైనా పంటకి మంచి ధర రావాలని అన్నదాతలు వేడుకొంటున్నారు.